కర్నూలు జిల్లాలో యురేనియం అన్వేషణ గుట్టుగా సాగుతోంది. యురేనియం పేరు వింటేనే హడలిపోతున్నతరుణంలో ఆళ్లగడ్డ వద్ద గుట్టు చప్పుకాకుండా 15 గ్రామాల్లో సర్వే చేస్తున్నారని తెలిసి రైతుల్లో గుబులు మొదలైంది. రైతులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై  సీరియస్ అయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ చేశారు. ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకం గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరో ట్వీట్‌లో 'సేవ్‌ నల్లమల' ప్రచార కార్యక్రమంలో భాగంగా విమలక్క పాడిన పాటను పోస్ట్‌ చేశారు.


కర్నూలు జిల్లాలో దాదాపు 10 రోజులుగా బోరు తవ్వకాల పేరుతో  యురేనియం వేట కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 17 ప్రాంతాల్లో ఈ సర్వే శిబిరాలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికుల్లో కలకలం బయల్దేరింది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పరిసరాల్లో కాల్వ గట్లపై బోర్లు కోసమని తవ్వకాలు మొదలు పెట్టి  ఒక్కో పాయింట్ లో 22-25 మంది సిబ్బంది రోజుకు రెండు షిప్టుల్లో పనిచేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి  నమూనాలను వెలికితీసి, ఐరన్ బాక్సుల్లో పెట్టి ఎక్కడికో తరలిస్తున్నారు. కాలువ గట్లపై ఏదో చేసుకుంటున్నారని  రైతులూ పెద్దగా పట్టించుకోలేదు. 


రెండురోజుల క్రితం యాదవాడకు చెందిన కొట్టం చిన నరసింహులు పట్టా భూమిలో అతనికి తెలియకుండానే పాయింట్లను గుర్తించి తవ్వకాలు చేశారు. దీంతో రైతులు నిలదీశారు. ఒక్కో పాయింట్ లో 10 వేల అడుగుల లోతు తవ్వి నమూనాలు తీసి పంపుతున్నామని అంగీకరించారు జాతీయ అణుశక్తి సంస్థ తరఫున వచ్చామని చెప్పుకుంటున్న అధికారులు. 8 నెలల వరకు ఈ పనులు కొనసాగిస్తామన్నారు.  ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాల విషయంలో ప్రజలకు  ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సర్వే, తవ్వకాలగురించి ప్రభుత్వానికేమీ తెలియదని ఎలా అంటారని ప్రశ్నించారు. కనీసం కలెక్టర్లకు కూడా తెలియకుండా తవ్వకాలు జరగడం ఆశ్చర్యంగా ఉందని ట్విట్టర్ లో  పేర్కొన్నారు. కర్నూలులో యురేనియం తవ్వకాలపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంతో ఒక్కసారి వాతావరణం వేడెక్కింది.  ప్రభుత్వ వివరణ బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని అటు జిల్లా వాసులు, ఇటు జనసేనాని సిద్ధమయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: