ఆర్థిక‌మాంద్యం కేంద్రంను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుచడంలో భాగంగా శనివారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) అధిపతులతో సమావేశమయ్యారు. ఇందులో 32 మహారత్న, నవరత్న హోదాలుగల సీపీఎస్‌ఈల సారథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థల మూలధన వ్యయం గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో పెట్టుబడులను పెంచాలని కోరారు. ఇందుకోసం వ్యాపారులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను వచ్చే నెల 15కల్లా తీర్చాలని ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చారు. అలాగే అక్టోబర్ 15 నాటికి రాబోయే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి కార్యాచరణను సమర్పించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు ఆరేళ్ల‌ కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికి పరిమితమైన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను తీర్చాలంటూ అక్టోబర్ 15ను గడువు తేదీగా నిర్ణయించారు.


కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు.. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి (ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి) రూ.84.68 లక్షల కోట్లుగా ఉన్న  ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) తొలి త్రైమాసికం చివరినాటికి రూ.88.18 లక్షలకోట్లకు పెరిగినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు 89.4 శాతం మేరకు ఉన్నట్టు శుక్రవారం విడుదలైన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి మొత్తం డేటెడ్ సెక్యూరిటీల్లో ఐదేండ్ల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలు దాదాపు 28.9 శాతం ఉన్నాయని, వీటిలో 40.3 శాతం సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకుల వద్ద, 24.3 శాతం సెక్యూరిటీలు బీమా కంపెనీల వద్ద ఉన్నాయని ఆ నివేదిక పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.1.44 లక్షల కోట్ల విలువైన డేటెడ్ సెక్యూరిటీలను జారీచేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో రూ.2.21 లక్షల కోట్ల డేటెడ్ సెక్యూరిటీలను జారీచేసింది. 


ఈ నేప‌థ్యంలో....గత నెల ఆగస్టు నాటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ.48,077 కోట్లను విడుదల చేశారని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ డిసెంబర్ ఆఖరుకల్లా మరో రూ.50,159 కోట్లను ఖర్చు చేస్తాయని, వచ్చే ఏడాది జనవరి-మార్చికిగాను రూ.54,700 కోట్లను ఇందుకు కేటాయించాయని చెప్పారు. ఇక 244 ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 4 లక్షల కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వెచ్చించాలని నిర్ణయించినట్లు వ్యయ కార్యదర్శి గిరీశ్ చంద్ర ముర్ము వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: