అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘భారత జాతిపిత’ అని ప్రధాని నరేంద్రమోదీని సంబోధించడాన్ని గాంధీజీ మునిమనవడు తుషార్‌ గాంధీ తప్పుపట్టారు. అమెరికా పితామహుడు జార్జి వాషింగ్టన్‌ స్థానాన్ని ట్రంప్‌ భర్తీ చేస్తారేమో అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హోస్టన్‌ వేదికగా జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మోదీని ఉద్ధేశించి భారత ‘జాతిపిత’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై గాంధీ ముని మనమడు తుషార్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ట్రంప్‌ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థకు తుషార్‌ తెలిపారు. ఆయన అమెరికా జాతిపిత అయిన జార్జి వాషింగ్టన్‌ స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం మహాత్ముడి 150వ జయంత్యుత్సవాలను కేవలం వారి గొప్పల కోసమే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాపు ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రతిచోటా ఆచరించాలని, కానీ దురదృష్టవశాత్తూ వాటిని అందరూ విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్ముడు కేవలం కరెన్సీ నోట్లపై, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పోస్టర్లకే పరిమితమయ్యారని తుషార్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలను సమాజమంతా ఆచరించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇదిలాఉండ‌గా, మహాత్మా గాంధీ అహింస బోధనలు ప్రపంచానికి గొప్ప మార్గదర్శకాలని సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్ కొనియాడారు. విబేధాలను సులభంగా రెచ్చగొడుతూ, చిన్న చిన్న వాటికే గొడవలకు పోతున్న ప్రస్తుత ప్రపంచం.. మహాత్ముడు చూపిన అహింసా మార్గాన్ని అనుసరించాలని సూచించారు. మహాత్ముడి సందేశాన్ని మనసుతో అర్థం చేసుకున్నవాళ్లు.. ఇతరులతో నెలకొన్న విబేధాల్ని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి. విద్వేషాలను తగ్గించుకొని.. ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించాలి అని లీ సియన్ పేర్కొన్నారు. సింగపూర్‌లోని భారతీయులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన గాంధీ మెమోరియల్ హాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: