ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బెడ్ లైట్లు వాడకం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. తక్కువ కరంట్ తీసుకుని చాలా ఎక్కువ వెలుతురు ఇవ్వడం వీటి ప్రత్యేకత. అందుకే ప్రభుత్వాలు కూడా ఎల్ ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇవి అంత సురక్షితం కాదంటున్నాయి కొన్ని అధ్యయనాలు.


భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ సిబా ప్రసాద్‌ మిశ్రా బృందం నిర్వహించిన అధ్యయనంలో అనేక షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంతకీ వీటితో ప్రమాదం ఏంటి అంటారా.. ఎల్‌ఈడీ కాంతి కాలుష్యం శృతిమించడం వల్ల నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెర వ్యాధి తదితర జీవనశైలి జబ్బులు వస్తున్నాయట. ఎల్ ఈడీ లైట్ల వర్ల కంటిచూపు దెబ్బతింటుందట. ఇది రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తుంది.


ఎక్కువ కాలం ఎల్‌ఈడీ కాంతులను చూసేవాళ్లు భవిష్యత్‌లో రంగులను గుర్తించే సామర్థ్యాన్ని సైతం కోల్పోయే ప్రమాదముందట. ఈ దుష్ప్రభావాలు కేవలం మనషులకే కాదట. జంతువుల్లోనూ ఈ దుష్ఫలితాలు వస్తాయట. వీటి కారణంగా కాంతి కూడా కాలుష్యానికి గురవుతోందట.


ఎల్‌ఈడీ కృత్రిమకాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా పక్షులు తమ మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినప్పుడు దారితప్పుతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. కప్పలు సైతం వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. గబ్బిలాలు ఈ కాంతి బారినపడినప్పుడు భౌతిక ఒత్తిడికి గురవుతున్నాయి.


వీటి ప్రభావం ఎక్కడెక్కడ ఎలా ఉందంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ కాంతి తీవ్రత 7,790 యూనిట్లుగా ఉంది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటర్‌స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. మన గ్రేటర్‌ హైదరాబాద్ సిటీ తరవాత కోల్‌కతా రెండోస్థానంలో ఉందట. ఈ సిటీలో 7,480 యూనిట్ల కాంతితీవ్రత ఉంది. మూడోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 7,270 యూనిట్ల కాంతి తీవ్రత నమోదైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: