ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్ది గారు పాదయాత్ర చేసిన సమయంలో ఎంతోమంది జగన్ ను కలిసి వారి బాధలు, వేదనలు చెప్పిన తరువాత వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే, వ్యవస్థను మెరుగుపరచాలంటే ఒక కొత్త ప్రయోగం చేయాలి మరియు కొత్త ఒరవడిని తీసుకొనిరావాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పూర్తి కాకముందే నాలుగు నెలల్లో 4 లక్షల పది వేల ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలలోని హామీలను మాత్రమే కాకుండా, ప్రజలకు మేలు చేసే ప్రతి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. 1,34,000 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మాత్రమే కాక 2,70,000 గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 
 
గ్రామీణ వ్యవస్థ, పట్టణ వ్యవస్థ అభివృద్ధిలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ భాగస్వామ్యులను చేస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. మీరు ఏదైనా పొరపాటు చేస్తే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి వస్తుందని బొత్స అన్నారు.చంద్రబాబునాయుడు గారు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు వాలంటీర్లపై చులకనభావంతో వ్యాఖ్యలు చేయటం సరికాదని బొత్స అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మరియు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటికే చేరుతాయని బొత్స అన్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: