ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన యువతకు జగన్ నియామక ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అందుకని నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకోవటానికి రెడీగా ఉండాలంటూ పిలుపుకూడా ఇచ్చారు.

 

మొత్తానికి చెప్పిన మాట గనుక జగన్ నిలబెట్టుకుంటే ప్రతిపక్షాల పని అందులోను చంద్రబాబునాయుడు పని దాదాపు అయిపోయినట్లే. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ దాదాపు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయల్లో వివిధ ఉద్యోగాలను భర్తీతో శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఇదే వరసను గనుక కొనసాగిస్తే దాదాపు లక్షలాది ఉద్యోగాలను జగన్ భర్తీ చేసేట్లే కనిపిస్తున్నారు. అదే గనుక జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే తాను సిఎంగా ఉన్న కాలంలో ఏనాడు ఉద్యోగాల కల్పన చేసింది లేదు. మొన్న ఐదేళ్ళ అధికారంలో కూడా డిఎస్సీ ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలైతే చేశారు కానీ భర్తీ మాత్రం చేయలేదు.

 

మొక్కుబడి ప్రకటనలు చేసి జనాలను మోసం చేసేవాళ్ళకు, ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చే వాళ్ళకు జనాలు తేడాను బాగానే గ్రహించారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపి గూబగుయ్యిమనిపించారు. 

 

తాజాగా జగన్ భర్తీ చేసిన వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలతో మిగిలిన నిరుద్యోగులకు కూడా ఆశలు చిగురించటం ఖాయంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా సంవత్సరాల తరబడి ఉండిపోయాయి. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నట్లుగా జగన్ ఆడుకునేందుకు సిద్దంగా లేరు. అందుకే ప్రతీ జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తానని జగన్ ప్రకటించగానే అందరూ హర్షం తెలుపుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: