ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేయటం కొరకు హాజరయ్యారు. సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ల పరీశీలన కూడా పూర్తయిన వారికి సీఎం జగన్ నియామక పత్రాలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా 20 లక్షల కంటే ఎక్కువమంది ఉద్యోగాల కొరకు హాజరు కావటం దాదాపుగా 1,40,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావటం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు. 
 
నాలుగు నెలలు పూర్తి కాకముందే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ అన్నారు. సొంత మండలంలోనే ఉద్యోగం వచ్చే అదృష్టం ఎంతో తక్కువ మందికి వస్తుందని అన్నారు. లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పారదర్శక పాలన అందించాలని సీఎం కోరారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొనిరావాలని జగన్ అన్నారు. 
 
ప్రజలకు సేవలు అందించటం కొరకు ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. గ్రామాలలో పాలనావ్యవస్థ వెంటిలేటర్ పై ఉంది. ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని తీసుకొచ్చామని అన్నారు. 72 గంటల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వచ్చిన వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వును ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 
 
2020 జనవరి 1వ తేదీ నుండి గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని జగన్ కోరారు. కులాలు, మతాలు, రాజకీయలు, పార్టీలు చూడొద్దని జగన్ అన్నారు. 2019 ఎన్నికల్లో మనకు ఓటు వేయనివారు కూడా పరిపాలనను చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: