గర్భగుడిలోని విగ్రహాలతో సహా అన్ని రెండుగా ఉండి.. చరిత్రలో ఓ స్థానం సంపాదించుకున్న ఆ దేవాలయంలో.. వారం రోజుల నుంచి ఓ వింత చోటు చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ నీరు ధారాళంగా ఉబికి  పైకి వస్తున్నాయి. ఇంతకీ ఎక్కడ ఆ ఆలయం.. బండరాయి నుంచి వస్తున్న నీటికి కారణమేంటో ఏ సారి పరిశీలిస్తే....!


నల్గొండ జిల్లా చండూరులో దక్షిణ కాశీగా వెలుగొందిన తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ పార్వతి జడల రామలిగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర అంతా విచిత్రంగా ఉంటుంది. ఆలయంలో రెండు గోపురాలు, రెండు ధ్వజస్థంబాలు, రెండు కళ్యాణ మండపాలు, రెండు కోనేరులు, రెండు నంది విగ్రహాలు అంతేకాక, గర్భగుడిలో విగ్రహాలు సైతం రెండుగా ఉంటాయి. ఇలా ఆలయంలో అన్ని రెండుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత అని చెబుతుంటారు స్థానికులు.  


కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం అతి పెద్ద బండరాయిపై ఉంటుంది. దీంతో అక్కడ చుక్క నీరు కూడా ఉండదు. కానీ వారం రోజుల నుంచి అక్కడో వింత చోటు చేసుకుంది. గుట్టపై ఉన్న బండ రాయికి పడిన రంధ్రాల నుంచి నీరు ఉబికి ధారగా వస్తుంది. నీరు రావడానికి ఎలాంటి ఆనవాళ్లు లేని అక్కడికి నీరు రావడం అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. 


బండ రాయి కొట్టి జీవనం సాగిస్తున్న కొందరు కూలీలు హద్దులు గీసి డ్రిల్లింగ్ యంత్రాలతో రంధ్రాలు చేశారు. అందులో కొన్ని రంధ్రాల నుంచి నీరు బయటికి వస్తుంది. గుట్టపైన గుండం ఉండడంతో అక్కడ పొరలు.. పోరలుగా ఉన్న బండతో పాటు అక్కడ అక్కడా మట్టి పొరలున్నాయి. ఆ పొరల్లో నిలిచిన నీరు వస్తుందని భావిస్తున్నారు. గుట్టపై స్వామివారి ఆలయం ఉండడంతో.. దిగువ భాగాన నీరు రావడం స్వామివారి నుంచి పాతాళ గంగ బయటికి వస్తుందంటున్నారు స్థానికులు. ఏది ఎలా ఉన్నా.. ఓ బండరాయి నుంచి నీరు ధారాళంగా రావడం మాత్రం ఓ వింతే అంటున్నారు స్థానికులు. ఈ వింతను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల జనం బారులు తీరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: