దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఏపీదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దాదాపు లక్షన్నర మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం ఓ చరిత్ర. దేశ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం. ప్రతి గ్రామానికి 12 కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికొత్త రికార్డ్. సొంత మండలంలో పనిచేసే అవకాశం ఉద్యోగులకు దక్కిన గొప్ప అదృష్టం. ఆ అవకాశాన్ని దక్కించుకున్న మీరంతా మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి" అని సీఎం అన్నారు.

 

 

 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "లంచాలు లేని.. వివక్ష లేని పారదర్శకత పని చేయాలి. వాలంటీర్లతో కలిసి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలి.అధికారం చలాయించడం కోసం ఉద్యోగం కాకుండా.. ప్రజల కోసం పనిచేసేలా బాధ్యతగా ఉండాలి. మౌలికవసతులు, పాఠశాల, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. కనీస వసతులు కూడా గ్రామాల్లో అందని పరిస్థితి. రేషన్ కార్డు, పెన్షన్ కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. మండల ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన దుస్థితి. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరిట ప్రజలను దోచుకుంది. గ్రామాల్లో పాలన వెంటిలేటర్‌పై ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రజల అవసరాలను ఇంటి వద్దే అందించేలా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం. అవినీతి లేకుండా 72 గంటల్లో సమస్యలు పరిష్కరించేలా ఉండాలి. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 500 సేవలు అందించాలి. రైతులకు నాణ్యమైన ఎరువులు అందజేస్తాం. ప్రతిగ్రామ వాలంటీర్‌కు స్మార్ట్ ఫోన్ ఇస్తాం. డిసెంబర్ మొదటి వారానికల్లా స్మార్ట్ ఫోన్‌తో పాటు పరికరాలు పంపిణీ చేస్తాం" అన్నారు.

 

 

 

"జనవరి ఒకటి నుంచి పూర్తిస్థాయిలో గ్రామ సచివాలయ సేవలు అందిస్తాం. 21 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినా.. ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసిన అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతి ఏడాదీ ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుంది. జనవరి నెలలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. ఈ పరీక్షల్లో అర్హత సాధించలేని వారంతా అధైర్య పడొద్దు.. మళ్లీ జనవరి రాబోతుంది, సిద్ధంగా ఉండాలి" అని సీఎం జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: