ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి తీవ్రత అంతా ఇంతా కాదు. గతంలో ఈ కులగజ్జి తెలంగాణాలో ఏదో మూలన స్వల్పంగా ఉండేది. హైదరాబాద్ నగరం విశాలాంద్రకు రాజధాని కావటం ఆపై ఆంధ్రప్రజల వలసతో కులాభిమానం ప్రభావం తెలంగాణాకు కూడా దిగుమతైంది. ముఖ్యంగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశంపార్టీ ప్రాభవంతో - "క్రిష్ణా, గుంటూరు"-జిల్లాల నుంచి వచ్చిన ఒక సామాజిక వర్గం రాష్ట్రంలోని అన్ని అంటే రాజకీయ, మీడియా, సినిమా & వినోదం, పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, గుత్తేదార్ రంగాల్లో వ్యాపించటమే కాదు - రాజకీయ అధికారాన్ని ఆలంబన చేసుకొని అనకొండ లా చుట్టేయటమే కాదు — వేరే సామాజిక వర్గాలను నిర్దాక్షిణ్యంగా అణగ ద్రొక్కేస్తూ తమ సామాజిక వర్గ ఆధిపత్యం తప్ప వేరే వారికి ఎలాంటి అతి చిన్నఅవకాశాలు దొరక్కుండా చేస్తూ ఒక రకంగా కులాధిపత్యంగా ఈ ప్రజాస్వామ్య పాలనను మార్చేశారు.


ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు రాజకీయాధికారాన్ని చిక్కించుకున్న తరవాత ఈ కులాధిపత్యం ఒక పైత్యంగా కులగజ్జిగా మారి తామర తంపరగా మురికిగుంట లో గుర్రపు డెక్క కలుపు మొక్కలా అల్లుకుపోయింది. టిడిపి వ్యవస్థాపక నాయకుడు నందమూరి తారక రామారావు తన సామాజికవర్గంపై ప్రేమ ఉన్నా- నాడు సామాజికంగా వెనకబడిన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చి కొత్త యువ రక్తాన్ని రాజకీయ నాళాల్లోకి ఎక్కించాడు.


నారా చంద్రబాబు నాయుడు అద్బికారంలోకి వచ్చాక - నూతన నగరాభివృద్ధిలో (సైబరాబాద్) ప్రాంతంలో సింహభాగం  భూములు, అవకాశాలు అన్నీ తన కులం వారికి, ఆపై తమ బందుగణం, ఆ తరవాత తమ పార్టీ వారు...సంతృప్తి చెందిన అనంతరం తమ ప్రాంతం వారికి పంచేసి తాము సర్వసంపదలు పెంచేసుకొని బలపడ్డారు. ఇది గమనించిన తెలంగాణా ప్రజలు ఉద్యమం లేవదీసి రాష్ట్ర విభజనకు నాంది పలికి సాధించుకున్నారు. ప్రజాకాంక్షలోనీళ్ళు, నిధులు, నియామకాలు, అంతర్లీనంగా భూములు ప్రధాన పాత్రవహించాయి.

 

అదే పద్దతిని అమరావతిలో అవలంబించిన టిడిపి - దాని ఆధిపత్య సామాజికవర్గాన్ని – 2019 ఎన్నికల్లో ఏపిలో ప్రజలు తన్ని తగలేశారు. అధికార కేంద్రీకరణ మూలంగా సువిశాల ఆంధ్రప్రదేశ్ విభజనకు గుఱైనా దానికి పరోక్ష కారణం ఏ సామాజిక వర్గమో? జాతికి తెలుసు. అయినా నిజం, యధార్ధం, క్షేత్ర స్థాయి ప్రజల మనొభీష్టం తెలుసుకోకుండా అమరావతిని సంపూర్ణ కేంద్రికరణ యోచనతో  ప్రారంభించటమే ఆ పార్టీకి, నాయకత్వానికి ఆ సామాజికవర్గానికి కావలసినంతగా "అపకీర్తి మచ్చ" మిగిలెలా ఏపి ప్రజలు అపజయాన్ని కట్టబెట్టారు.

 

అదే కులగజ్జిని - బొమ్మాళి నిన్నొదల అన్నట్లు – వదల కుండా ఆ సామాజికవర్గ అభ్యర్ధినే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్ధిగా నిలబెట్టటం ఎంతవరకు సబబు? అనేదాన్ని గురించి ఆ పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా తెలంగాణా నాయకత్వం ఆలోచించాలి. గత శాసనసభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది. అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీగా గెలుపొంద‌డంతో, ఉప ఎన్నిక ఇక్కడ అనివార్యం అయింది. 

 

తెలంగాణా అధికార పార్టీకి బందు ప్రీతి కులాభిమానం లేవని కాదు. ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికలో బంగారు తెలంగాణాలోని ప్రప్రదమ - బంగారు కుటుంబానికి చెందిన ఆడపడుచును తుక్కురేగేలా ఓటమి పాల్జేశారు తెలంగాణా ప్రజాబాహుళ్యం. ఇంకా అదే కులప్రీతిని వీడక పోతే ఆ నాయకత్వం కూడా భవిష్యత్తులో  శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. కాలం చెప్పబోతున్న తీర్పది.

 

ఇప్పుడు టీఅరెస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, అంటూ ఇద్దరు బలమైన రెడ్డి సామాజిక వర్గం వారిని, టిడిపి తమ సామాజిక వర్గ అభ్యర్ధి చావా కిరణ్మయిని బరిలోకి దింపారు.

 

ఈ రెండు బలమైన కులాలు మాత్రమే రాజకీయాధికారాన్ని పంచుకోవాలా?  వేరే కులాల వారికి ఆకాంక్షలు, ఆశలు ఉండవా? వారికి రాజకీయ అధికారాలు వద్దా? అనేది ప్రధాన ప్రశ్నగా తెలంగాణా ప్రజల్లో గాఢత సంతరించుకున్న వేళ - పాత తప్పునే తిరిగి తిరిగి చేస్తున్న టిడిపి తెలంగాణాలో సెకండ్ ఇన్నింగ్స్ లో విజయం బలంగా కోరుకోవట్లేదా?

 

ఇప్పుడు నాయకులు చేయాల్సింది స్వంత లాభం - స్వంత కుల అభిమానం కొంతైనా వదులు కోకపోతే రాజకీయ పతనం అనివార్యం అని గుర్తుంచుకోవటం అవసరం. ఏపిలో పార్టీకి జరిగిన పరాభవం - ఆ అనుభవం సరిపోదా! తెలంగాణా ప్రజలు మాటలు చెప్పరు. సందర్భంలో మాత్రం కర్రుకాల్చి వాత పెట్టేస్తారు

 

తెలంగాణా కాంగ్రెస్ లో రాజకీయాధిపత్యం ఎక్కువగా ఉన్న రెడ్డి కుల సంజాతను నిలబెట్టటం, ఆమె భర్తే శాసనసభ అభ్యర్ధిగా కొనసాగుతున్నవేళ ఆమె గెలుపు అసంభవం అని చెప్పక తప్పదు. ఇక్కడ ఒక స్వంత స్వార్ధం, ఒకే కుటుంబ స్వార్ధం, కులస్వార్ధం మూడూ కలసి  ప్రభవిల్లుతున్న వేళ ఆమె ఓటమి ముందే తేలిపోయింది.

*టీఅరెస్ తన కులం అభ్యర్ధిని నిలబెట్టకపోవటం ఒక ప్లస్ పాయింట్.

*టిడిపి ఇంత పతనమైనా తన కుల సంజాతనే  అభ్యర్ధిని నిలపటం ఒక మైనస్ పాయింట్.

*ఇక్కడ బిజెపి అభ్యర్ధిగా డాక్టర్ కోట రామారావు - వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యావంతుడు కాబట్టి ఎన్నికల గాలి బిజేపి వైపే మళ్ళోచ్చని హుజూర్ నగర్ నుండి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: