ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే పల్నాటి పులి అని పేరు. ఆయన దేనికి భయపడే మనిషి కాదు. ఆయన తీరు కూడా అలా ఉండదు, గంభీరమైన మనిషిగా ఉంటారు. ఆయన నడకలోనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆయన అధినేతలను గౌరవిస్తారు కానీ తలవంచరు. అలాగే ప్రభుత్వాల విషయంలోనూ అంతే. తనకు నచ్చనిది ఏదైనా ఉంటే పాలకులు ఎవరైనా సరే నిలదీయడం ఆయన నిజం. ఇక తన మీద ఆరోపణల విషయానికి వస్తే కోడెల వాటిని లైట్ తీసుకుంటారు. చాలా సార్లు వాటి మీద నిగ్గు తేల్చడానికి పోరాడుతారు.


ఇటువంటి తత్వం కలిగిన కోడెల భయపడ్డారు అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న తీరే ఇపుడు ఆయన అభిమానులను, వర్తమాన  రాజకీయాలను జాగ్రత్తగా గమనిచేవారిని షాక్ కి గురి చేస్తోంది. కోడెల సంతాపసభ గుంటూర్లో ఈ రోజు  జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కోడెలకు భయపడవద్దు అని చెప్పాను, అయినా ఇలా చేశారంటూ ముక్తాయింపు ఇవ్వడాన్ని ఆయన అభిమానులే సహించలేకపోతున్నారు.


కోడెలకు చాలా సార్లు భయపడవద్దు అని చెప్పానని బాబు అనడం విడ్డూరమే. అసలు కొడెల అన్న క్యారక్టర్ ఎపుడూ భయపడదు అన్నది బాబుకు తెలియదా అంటున్నారు అనుచరులు. ఆయన హోం మంత్రిగా ఉన్నపుడే కోస్తాలో బలమైన నాయకుడిగా ఉన్న వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. నాడు రాష్ట్రమే అతలాకుతలమైంది.  అయినా కోడెల ఎక్కడా వెరవలేదు. అప్పటి సీఎం ఎన్టీయార్ వినతి మేరకు రాజీనామా చేసినా, నింద తన మీదకు వచ్చినా ఆయన భయపడలేదు. తరువాత కాలం నుంచి నేటి వరకూ ఆ కేసు విషయంలో తనకు సంబంధం లేదని ధైర్యంగా అనేక వేదికల మీద వివరణ‌ ఇచ్చుకున్నారు.


ఇక కోడెల  ఇంట్లో బాంబులు పేలాయి. నలుగురు చనిపోయారు. అది 1999 ప్రాంతం. ఎన్నికల సమయం. అయినా వెల్లువలా వచ్చినా ఆరోపణలను ఆయన ఖాతరు చేయలేదు. ఇక అయిదేళ్ళ పాటు స్పీకర్ గా ఉన్న కోడెల బాబు సర్కార్ వత్తిడితోనే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా వారి  మీద ఫిరాయింపు చట్టం మేరకు  చర్యలు తీసుకోలేదని అంటారు. అయినా బాబు కోసం ఆయన అన్నీ సహించారు అంటారు. మరి అటువంటి కోడెల ఎందుకు భయపడతారు, ఎవరికి భయపడతారు.


ఆయన తాను మొదటి నుంచి కొనసాగిన టీడీపీలో నిరాదరణకు బాధపడి ఉండాలి. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉంటూ పార్టీలో సరైన గుర్తింపు  చివరి రోజుల్లో, అది కూడా కష్టకాలంలో లేదని ఆయన ఆవేదన చెందిఉండాలి. తనకు వెన్నుదన్నుగా పార్టీ పెద్దలు లేరని కోడెల మనస్తాపం చెందిఉండాలి. అంతే తప్ప ఆయన భయపడి ఆత్మహత్య చేసుకోలేదు. గుండె పగిలి చేసుకున్నారని ఆయన గురించి తెలిసిన వారు అంటారు. మరి చనిపోయిన  తరువాత‌ ఈ పల్నాటి పులిని పిరికివాడిగా చిత్రీకరించడం దారుణమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: