నాలుగు నెలల్లో 4 లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారని, వేల కోట్ల ప్రజాధనం వైకాపాకు దోచి పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు పి అశోక్ కుమార్ పేర్కొన్నారు.   ఈ నాలుగు నెలల్లోనే 40 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి పోగొట్టారని అన్నారు.  5 లక్షల మందికి నిరుద్యోగ భృతి రద్దు చేశారని,  ఇసుక కొరత సృష్టించి 20 లక్షల మంది ఉపాధి పోగొట్టారని,  అన్న క్యాంటీన్లు, యూనివర్సిటీలలో, రాష్ట్ర సెక్రటేరియట్‌లో, అలాగే వివిధ సంస్థలలో వేలాది ఉద్యోగాలు తొలగించారని అన్నారు.  ఉపాధిహామీ పనులలో 2018 మార్చి వరకు 16.78 లక్షల మంది ఉపాధి పొందగా.. జగన్‌ పాలనలో  4-9-19లో 14.46 లక్షలకు తగ్గిపోయింది. అంటే 2.32 లక్షల మందికి ఉపాధి పోయింది. 

ఉపాధి హామీ మెటిరీయల్‌ కాంపొనెంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1477 కోట్లు విడుదల చేసినా దాన్ని జగన్‌ ప్రభుత్వం ఆయా శాఖలకు విడుదల చేయలేదు. దీంతో మరిన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారు. పేపరు లీకేజీ వల్ల పరీక్షలు రాసిన 18 లక్షల మంది నష్టపోయారు. ఈ రకరంగా జగన్‌ ప్రభుత్వం 40 లక్షల మంది నోరుకొట్టి 4 లక్షల వైకాపా కార్యకర్తలకు పెట్టారు. ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగాన్ని అతలాకుతలం చేశారు. ఇది ఉద్యోగాల విప్లవమా? అని ప్రశ్నించారు.  ''గ్రామ వాలంటీర్లలో 90% ఉద్యోగాలు మన కార్యకర్తలకే వచ్చాయి, నా దగ్గర వాటికి సంబంధించి లెక్కలన్నీ ఉన్నాయి, గ్రామ సచివాలయ ఉద్యోగాలు కూడా మన కార్యకర్తలకే వచ్చాయి'' అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  లంచాలు లేని, వివక్ష లేని పారదర్శక పాలన అందించాలని సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పిలుపునిచ్చిన జగన్‌.. ప్రశ్నాపత్రం లీకేజీపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. 


ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని సీఎం ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదు?వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుగానే ప్రశ్నాపత్రం లీక్‌ చేసి 18 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. అభ్యర్ధుల అర్హతల విషయంలో నోటిఫికేషన్‌లో ఒకరకంగా, అప్లికేషన్‌లో మరోరకంగా నిబంధనలు మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మార్పులు, చేర్పులు చేయడాన్ని బట్టి వైకాపా వారికోసమే  ఇదంతా చేశారని స్పష్టం కావడం లేదా? అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పరీక్షల్లో అర్హత సాధించి, సర్టిఫికెట్ల పరిశీలన కోసం కాల్‌ లెటర్లు పంపించి, ఇప్పుడు అర్హులు కాదంటూ ఏఎన్‌ఎం ఉద్యోగార్థులను వెనక్కి  వెళ్లిపోమనడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 1187 నర్సింగ్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులలో చాలా మందికి కావాల్సిన దానికంటే ఎక్కువ విద్యార్హత ఉందనే సాకుతో తిరస్కరించడం కుట్రపూరితమని పేర్కొన్నారు.  


కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు బీటెక్‌, ఎంఏ విద్యార్హత ఉన్నవారు ఎంపికవ్వగా లేనిది.. ఏఎన్‌ఎం పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హతలు ఉంటే తిరస్కరించడం అన్యాయం కాదా? వైకాపా వారి కోసం కాదా? విజయసాయిరెడ్డి ప్రకటనకు ఇది రుజువు కాదా? నర్సింగ్‌ పోస్టులకు ఏఎన్‌ఎం అర్హతగా నిర్ణయించినప్పుడు, బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారిని పరీక్షలు రాసేందుకు ఏవిధంగా అనుమతించారు? నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ఓ వైపు ఉద్యోగాల భర్తీ అంటూనే మరోవైపు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు.  వేలాదిమంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించి వైసీపీ కార్యకర్తలను నియమిస్తూ ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. దీంతో వారంతా ఆందోళన బాట పడుతున్నారని అయన పేర్కొన్నారు.  సీఎం జగన్‌ నివాసం వద్ద 144 సెక్షన్‌ విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది.ఇసుక కొరతతో 25 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 125 వృత్తులను దెబ్బతీశారు.నిరుద్యోగ భృతి రద్దు చేసి 5 లక్షల మంది యువతకు అన్యాయం చేశారు. యూనివర్సిటీల్లో ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ.. వైసీపీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారని అశోక్ బాబు విమర్శించారు.  మరి అశోక్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎలా స్పందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: