సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఈ అంశంపై కీలకమైన నిర్ణయం తీసుకుంటుందా ? ఇలాంటి కీలకమైన అంశాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే కేబినెట్ భేటీలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.


కొత్త రెవెన్యూ చట్టం, సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ సమ్మె అంశంపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం కచ్చితంగా తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యలో పాత సచివాలయం కూల్చివేత అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.


ఇప్పటికే సచివాలయం తరలింపు పూర్తయిన నేపథ్యంలో... భవనాల కూల్చివేతపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తమ డిమాండ్ల నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు అల్టిమేటం జారీ చేశాయి. దీంతో సమ్మె నివారణకు తీసుకొవాల్సిన చర్యలపై తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో చేసినట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమా ? లేక కార్మికులు లేవనెత్తిన ఇతర డిమాండ్లపై చర్చకు కమిటీ వేయడమా ? అన్న అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.


ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం ఆర్టీసీని ప్ర‌భుత్వ ప‌రం చేసి కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించిన నేప‌థ్యంలో టీఎస్ ఆర్టీసీని కూడా ప్ర‌భుత్వంలో విలీనం చేసి, కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌ని ఏనాటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఈ కేబినేట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సాహాసోపేత నిర్ణ‌యం తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే...



మరింత సమాచారం తెలుసుకోండి: