గత మే నెలలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ...తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఇతర పార్టీ నేతలనీ చేర్చుకుని అధికార టీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఏపీలో కూడా టీడీపీ, జనసేన నేతలని చేర్చుకున్న బీజేపీకి పెద్దగా ఉపయోగం రానట్టే కనిపిస్తోంది. దీనికి బీజేపీలో ఉన్న నేతల వైఖరే  కారణంగా కనిపిస్తోంది.


2014లో టీడీపీతో పొత్తులో పోటీ చేసిన బీజేపీ...తర్వాత పొత్తు తెగదెంపులు చేసుకుంది. దీంతో మొన్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. అయితే పరోక్షంగా మాత్రం వైసీపీ మద్ధతు ఇచ్చిందనే విషయం అందరికి తెలుసు. ఇక ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా సీట్లు తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పరచింది. దీంతో వైసీపీకి బీజేపీ పూర్తి సాకారం అందిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా టీడీపీ నేతలు బీజేపీలో చేరడంతో పరిస్థితులు మారిపోయాయి.


మొన్నటివరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న సుజనా చౌదరీ, సీఎం రమేశ్ లాంటి నేతలు చేరడంతో బీజేపీ లైన్ మారింది. వీరు వైసీపీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వారు టీడీపీ మద్ధతుదారులు అని ప్రచారం వచ్చేసింది. అలాగే బీజేపీలో ఉన్న మరికొందరు వైసీపీకి మద్ధతుగా నిలుస్తున్నారు. వారు ముందు నుంచి టీడీపీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు.


ఈ విధంగా బీజేపీలో రెండు వర్గాలు టీడీపీ, వైసీపీ ఎజెండాలని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే వీరి మధ్య అసలు బీజేపీ నేతలు ఎవరో తెలియకుండా ఉంది. మొత్తం మీద ఈ పరిణామాలు ఏపీలో బీజేపీకి ఎదగడానికి ఆటంకం కలిగిస్తాయనే చెప్పాలి. ఇప్ప‌టికే బీజేపీలో కొత్త నేత‌ల ఎంట్రీతో పాత నేత‌లు ఎక్క‌డ ఉన్నారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఫైటింగ్‌తో బీజేపీ మ‌రింత దిగ‌జార‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: