తెలంగాణ‌లోనే కాకుండా....పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా రాజ‌కీయ వ‌ర్గాల‌ దృష్టి ఇప్పుడు...హుజూర్ నగర్ అసెంబ్లీకి జరగనున్న ఉపఎన్నికపైనే ఉంద‌నేది నిజం. ఈ ఉప ఎన్నిక‌లో భాగంగా ఇవాళ్టీతో నామినేషన్ల పర్వం ముగిసిది. అన్ని ప్ర‌ధాన‌ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున పద్మావతి, బీజేపీ అభ్యర్థి రామారావు, టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయి, సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 119 మంది నామినేషన్‌ పత్రాలను అధికారులకు అందజేశారు. 


నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో సోమవారం ఆయా పార్టీల అభ్యర్థులు ర్యాలీగా వచ్చి పత్రాలు దాఖలు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఎంతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు హోరాహోరీ పోటీకి సిద్ధ‌ప‌డుతున్నారు. దీంతో ఇవాళ ఒకేరోజు ఏకంగా 109 నామినేషన్లు దాఖలయ్యాయి. హుజూర్‌నగర్‌లో అక్టోబర్‌ 21న పోలింగ్‌, అక్టోబర్‌ 24న కౌంటింగ్‌ జరుగుతుంది.   


కాగా, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్ నేతలు సీపీఐ నాయకులను కలిశారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు మద్దతు కోరారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ తదితరులతో చర్చించారు. దాదాపు 45 నిమిషాలపాటు ఇరుపార్టీల నేతల మధ్య మంతనాలు జరిగాయి.


ఇదిలాఉండ‌గా, తెలుగుదేశం పార్టీకి ఈ ఉప ఎన్నిక‌కు ముందే ఊహించ‌ని షాక్ త‌గిలింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు .. మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ పార్టీ సభ్యత్వం, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: