ఏపీ సీఎం జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులు కోరుకుంటున్నారు. అందుకే అమ్మవడి వంటి సంచలన పథకాలకు శ్రీకారం చుట్టారు. అయితే విద్యావిషయంలో ఇప్పటికే సత్ఫలితాలు సాధిస్తున్న ఢిల్లీ విజయగాధ జగన్ కు స్ఫూర్తిగా నిలుస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఢిల్లీ విద్యావ్యవస్థ తీరు తెన్నులేంటి..? అసలు ఏముంది ఢిల్లీ విద్యావ్యవస్థలో?


ఢిల్లీ విద్యావ్యవస్థ విజయవంతం కావడానికి మూడు కారణాలు కనిపించాయి. మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ప్రస్తుత కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్ లో 25% కేటాయించింది. ఢిల్లీలో మొత్తం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని మున్సిపల్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇక్కడ కేవలం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు క్రేజ్ ఉండటం విశేషం.


స్కూల్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరిట ఆరు పాఠశాలలను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దింది ఢిల్లీ ప్రభుత్వం. ఇవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాతి క్రమంలో ప్రతిభ మరియు సర్వోదయ పాఠశాలల పేరుతో అభివృద్ధి చేశారు. ఉపాధ్యాయులను, తల్లిదండ్రులనే కాక తమ పార్టీ కార్యకర్తలను సైతం ఈ సంస్కరణల్లో భాగస్వాములను చేయడం విశేషం.


మరో కీలక అంశం తల్లిదండ్రుల కమిటీలు. ఢిల్లీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మధ్య ఉన్న పరస్పర సహకారం అబ్బురపరుస్తుంది. తల్లిదండ్రుల కమిటీ లేకపోతే పాఠశాల అభివృద్ధి అసాధ్యమని ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 54 మంది ప్రిన్సిపాళ్లను శిక్షణ నిమిత్తం సింగపూర్, ఫిన్లాండ్, లండన్ వంటి ప్రాంతాలకు పంపించారు.


అలాగే ఔత్సాహికులైన ఉపాధ్యాయులను కూడా శిక్షణకు పంపించారు. వీరితో ఒక రిసోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు తిరిగి మొత్తం ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చారు. టీచర్లలో నిబద్ధత పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయడం తమకు గర్వకారణంగా ఉందని వారు చెబుతున్నారు. గత సంవత్సరం ఢిల్లీ విద్యాశాఖకు మరపురానిది. ఎందుకంటే మొట్టమొదటిసారి సి బి ఎస్ సి బోర్డు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలను అధిగమించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: