ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటుగా ఈనెల 21 వ తేదీన హుజూర్ నగర్ నియోజక వర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతున్నది.  ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెరాస, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు సిద్ధం అయ్యాయి.  నిన్నే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  ప్రచారాన్ని సిద్ధం చేస్తున్నారు.  


ప్రచారం అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ.. విమర్శించుకుంటూ ప్రచారం చేసుకుంటారు.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, విమర్శలు సక్రమంగా ఉంటె బాగుంటుంది.  కానీ, ప్రచారం సమయంలో చేసుకునే విమర్శలు మరోలా ఉంటాయి.  తెలంగాణలో అప్రతిహాసంగా దూసుకుపోతున్న తెరాస కారు హుజూర్ నగర్ లో కూడా అదే విధంగా దూసుకుపోవాలని చూస్తున్నది.  


అందుకోసమే సామాజికంగా, ఆర్ధికంగా బలంగా ఉన్న అభ్యర్థిని రంగంలోకి దించడమే కాకుండా తెరాస క్యాడర్ మొత్తం హుజూర్ నగర్లోనే ఉండి.. అక్కడ ప్రచారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ విషయంలో అన్ని పార్టీలకంటే ముందు ఉండి ప్రచారం చేస్తున్నది.  అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోవడానికి సిద్ధం అవుతున్నది.  కాంగ్రెస్ పార్టీ గతంలో అక్కడ విజయం సాధించింది.  అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు మొదలుపెట్టింది.  


అయితే, బీజేపీ కూడా బీసీ కార్డును ఉపయోగించి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే.  ఎలాగైనా అక్కడ విజయం సాధించి రెండు పార్టీలకు దెబ్బ కొట్టాలని చూస్తున్నది.  అంతేకాదు, బీజేపీ తో పటు టిడిపి కూడా బరిలోకి దిగింది. తెలంగాణలో మనుగడ కోసం టిడిపి పాకులాడుతున్నది.  ఎలాగైనా టిడిపి అక్కడ కొంతమేర ప్రభావం చూపగలిగితే.. భవిష్యత్తులో తిరిగి పుంజుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నది టిడిపి వాదన.  


మరింత సమాచారం తెలుసుకోండి: