ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. జగన్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం క్రితమే వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ప్రభుత్వం ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేయటంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు తమ సర్వీసులను కొనసాగించనున్నారు. 
 
ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఈ నెల నుండే అమలు కాబోతున్నాయి. గతంలోనే ప్రభుత్వం ఈ విషయం గురించి ప్రకటనలు చేసింది. కానీ నిన్నటినుండి ఈ ఉత్తర్వులు అధికారికంగా అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 53,000 మంది ఉద్యోగులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, వైయస్సార్ ఆర్టీసీ మజ్దూర్ సంఘం సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపాయి. జగన్ తో పాటు పదవీ విరమణ వయస్సు పెంపు కొరకు కృషి చేసిన అధికారులు మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపాయి. ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయాలతో భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: