మందులోల్ల మాయలో సంచ‌ల‌నాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. దొంగ బిల్లుల‌తో కోట్ల‌కు కోట్లు నొక్కేసేందుకు ప్ర‌యత్నించ‌గా...అందులోని బ‌డాబాబుల బండారం వెలుగులోకి వ‌చ్చింది. తప్పుడు బిల్లులు పెట్టాలంటూ ఈఎస్‌ఐ డాక్టర్లపై ఆర్సీపురం ఈఎస్‌ఐ దవాఖాన సీనియర్‌ అసిస్టెంట్‌ ముదిమెల సురేంద్రనాథ్‌ ఒత్తిడి చేస్తున్నట్లు ఆడియో క్లిప్పుల ద్వారా వెల్లడైంది. ఆడియో క్లిప్పుల నేపథ్యంలో సురేంద్రనాథ్‌బాబును ఏసీబీ అధికారులు అరెస్టుచేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జేడీ పద్మ, ఏడీ ఇందిర సహా ఏడుగురిని అరెస్టు చేయగా.. వారికి ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.


సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ ఆడియోలో....ఈఎస్‌ఐకి సరఫరాచేసే మందుల కొనుగోళ్లకు సంబంధించి మెడికల్‌ క్యాంపు పేరుతో రూ.10 లక్షల విలువచేసే మందులు పంపినట్లు రికార్డులు సృష్టించాలని ఓ మహిళా వైద్యురాలిపై సురేంద్రనాథ్‌ ఒత్తిడిచేస్తున్నట్టు ఆ సంభాషణల్లో ఉంది. తప్పుడు బిల్లులు తయారుచేసేందుకు సదరు మహిళా వైద్యురాలు అంగీకరించకపోవడంతో సురేంద్రనాథ్‌ ఆమెను బెదిరిస్తూ మాట్లాడాడు. దీని ఆధారంగా అవినీతి, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన నేరానికిగాను సురేంద్రనాథ్‌ను అరెస్టుచేశారు. 


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల కొనుగోళ్ల కుంభకోణంలో  మందుల కొనుగోళ్ల రూపంలో సుమారు వెయ్యికోట్ల రూపాయలకుపైగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. తొలుత రూ.200 కోట్ల వరకు ఉంటుందని అనుకున్నా.. దర్యాప్తు లోతుగా జరుగుతున్నకొద్దీ అక్రమాల చిట్టా కూడా పెరుగుతూ పోతోంది. కనీసంగా రూ.700-800 కోట్ల వరకు అక్రమాలు జరిగి ఉంటాయని, వెయ్యికోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. ఇదంతా వ్యవస్థీకృతంగా చేశారని, దీన్ని వెలికితీయడం ఏసీబీకి నిజం గా పెద్ద సవాలేనని ఈఎస్‌ఐలో పనిచేసి రిటైర్‌ అయిన అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ లేకపోవడం, ఏళ్ల‌ తరబడి ఒకేపోస్టులో అధికారులు మకాంవేయడం ఐఎంఎస్‌లో అక్రమాలకు ఊతమిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారులతోపాటు కొందరు కిందిస్థాయి సిబ్బంది కూడా కుమ్మక్కయ్యారు. ఎక్కడా ఉపయోగం లేని మందులను కొనుగోలు చేయడమే కాకుండా.. విచిత్రంగా అసలు ఫార్మా కంపెనీలు లేకుండానే మందులు కొనుగోలు చేసిన వైనం ఏసీబీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: