సినీ రంగంలో పవన్ కళ్యాణ్ చేసింది పట్టుమని పాతిక సినిమాలు. అందులో కూడా ఫ్లాప్స్, డిజాస్టర్ల‌తో పాటు. హిట్లు, బ్లాక్ కూడా ఉన్నాయి. అయితే పవన్ క్రేజ్ మాత్రం మరే హీరోకు లేదు. అన్న చిరంజీవి 150 సినిమాలు చేసి ఒక్కో మెట్టు ఎక్కి సంపాదించుకున్న క్రేజ్ ని  పవన్ తక్కువ టైంలోనే సాధించారు. దానికి కారణాలు చెప్పమంటే ఎవరూ చెప్పలేరు. పవన్ ఇమేజ్ అలాటిది అని అనుకోవాల్సిందే.


ఇక పవన్ సినీ గ్లామర్ ని రాజకీయాలోకి ట్రాన్స్ ఫర్ చేస్తే ఆయనే ఏపీకి సీఎం కావాలి. కానీ అలా జరగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు సీట్లలో తానే స్వయంగా ఓటమిపాలు అయ్యారు. ఇక జనసేన పార్టీని కూడా ఎన్నికల ముందు వరకూ వన్ మ్యాన్ ఆర్మీగా పవన్ నడిపిస్తూ వచ్చారు. ఎన్నికల ఫలితాల తరువాత మాత్రం పార్టీని నిర్మించే పనిలో ఉన్నారు. నిజం చెప్పాలంటే పార్టీని 2014లో పెట్టినా పవన్ ఇపుడిపుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నారనుకోవాలి.


అయితే ఎన్నికలు జరిగి కొత్త సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిపోయాయి. వైసీపీ సర్కార్ మంచి పనులు చేసింది. కొన్ని తడబాట్లు, పొరపాట్లు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో పవన్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా అంటే సమాధానం లేదు. పవన్ రాజకీయాల్లోకి వచ్చినపుడు చాలా మంచి మాటలు చెప్పారు. ఏదో తిట్టాలని ప్రభుత్వాన్ని తిట్టరాదు, మంచి చేస్తే కూడా మెచ్చుకునే తీరు ఉండాలి అని ఆయనే అన్నారు. ప్రభుత్వాన్ని పని చేయనివ్వాలి. వూరికే విమర్శలు చేయడం సరికాదు అని కూడా ఆయనే అన్నారు. అటువంటి పవన్ వైసీపీ అధికారంలోకి రాగానే చేస్తున్నదేంటి అంటే చీటికి మాటికీ విమర్శలు చేయడమే.


ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పవన్ కి ఉంది. కానీ ఆయన చెప్పినట్లుగానే ప్రభుత్వం చేసిన మంచి పనులు మెచ్చుకుని చెడ్డవి అని ఆయన అనుకున్నవి విమర్శలు చేస్తే జనాకికి ఓ నమ్మకం కలిగేది. జగన్ లక్షలాది మంది నిరుద్యోగులకు జాబ్స్ ఇచ్చారు. చిరంజీవి చెప్పిన సామాజిక న్యాయాన్ని ఆయన మంత్రి వర్గం కూర్పుతో పాటు నామినేటెడ్ పదవుల నియామకాల్లో చేపడుతున్నారు. ఇందుకోసం చట్టాన్నే చేశారు. కాంట్రాక్టులు  కూడా బడుగులకు వచ్చేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు లేకుండా చూస్తున్నారు.


గ్రామ సచివాలయ కాన్సెప్ట్ కూడా మంచిదేనని మేధావులు అంటున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల 780 కోట్లను ఆదా చేశామని చెబుతున్నారు. ఇక పవన్ తాను చెప్పుకుంటున్నట్లుగా తానే లేవనెత్తిన ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఒక్కసారిగా పెన్షన్ పదివేల రూపాయలు చేశారు. అక్కడ 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు. డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.


మరి ఇవన్నీ పవన్ కి కనిపించడంలేదా అని వైసీపీ నేతలే కాదు అంతా అంటున్నారంటే అర్ధముందిగా. ఇక పవన్ వీలు చిక్కితే విమర్శలు చేస్తున్నారు. కరెంట్ కోతలు ఉంటే ట్వీట్ చేస్తున్నారు. ఇసుక కొరత మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ మంచివే, కానీ ప్రభుత్వాన్ని తిట్టడమేనా, సలహాలు ఇవ్వడం లేదా. ఇదేనా కొత్త రాజకీయం అని అంటున్న వారూ ఉన్నారు. పవన్ రెండవ వైపు చూడకుండా జగన్ని విమర్శించాలని మాత్రమే అనుకుంటే చంద్రబాబు మాదిరిగా ఆయన కూడా తేలిక అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: