తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ బిల్డింగ్స్ కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ నెల 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. దసరా సెలవుల తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సచివాలయం కూల్చివేత సరైనదా కాదా అనే విషయంపై తాము అవసరమైతే రోజూ విచారిస్తామని అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్ జనరల్ కు సూచించింది. హైకోర్టులో మూడు నెలలకు పైగా ఈ విచారణ నడుస్తోంది. 



ఈనెల 13 వరకూ దసరా సెలవులు ఉన్నందున విచారించలేమని కోర్టు తెలిపింది. సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము లోతుగా విచారిస్తామని తెలిపింది. అయితే అడ్వొకేట్ జనరల్.. సచివాలయం తరలింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని రేపటి నుంచి ఫైల్స్ తరలింపు కార్యక్రమానికి ప్రయత్నాలు చేసామని కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ స్టే ఇవ్వాలని కోరినా కోర్టు నిరాకరించింది. దీనిపై మౌఖిక ఆదేశాలు మాత్రం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. రేపటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫైల్స్ తరలింపు కార్యక్రమం చేపట్టింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఈరోజు విచారణకు స్వీకరించింది.  600 కోట్ల ప్రజా ధనం వృథా కాకుండా చూడాలని వీరు కోర్టుకు విన్నవించుకున్నారు.



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సరిపోయిన ఈ భవనం ఇప్పటి నాయకుల మూఢనమ్మకాల కోసమే కూల్చివేతకు సిద్దమవుతున్నారనేది వాదన. మరో 60ఏళ్ల వరకూ ఈ భవనాలకు ఎటువంటి ప్రమాదం ఉండదని ఇప్పటికే వివరించారు. హైకోర్టు నిర్ణయంతో ప్రస్తుతం ఫైళ్ల తరలింపు కార్యక్రమం నిలిచిపోనుంది. తరువాత కూడా దీనిపై సుదీర్ఘ విచారణలు కొనసాగే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చక్కెదురైనట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: