తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కొడుకు కోడెల శివరామకృష్ణ లొంగిపోయారు. ఈ పనేదో ముందే చేసుంటే కనీసం కోడెల ఆత్మహత్య చేసుకునే అవసరం ఉండేది కాదని టిడిపి నేతలంటున్నారు. పోలీసుల రికార్డు ప్రకారమైతే  శివరామ్ గడచిన మూడు నెలలుగా పరారీలో ఉన్నారు.

 

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలకు శివరామ్ తో పాటు ఆయన సోదరి విజయలక్ష్మి మీద కూడా చాలా కేసులు నమోదయ్యాయి. కోడెల స్పీకర్ అయ్యేటప్పటికి కొడుకు, కూతురు గురించి బయట జనాలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఎప్పుడైతే కోడెల స్పీకర్ అయ్యారో అప్పటి నుండే సంతానం అరాచకాలకు తెరలేచింది. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలు కేంద్రంగా వీళ్ళద్దరు సాగించిన అరాచకాలు అంతా ఇంతా కాదు.

 

భూ దందాలు, భూ ఆక్రమణలు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయటం, ఉద్యోగాలిప్పిస్తామని, లైసెన్సులిప్పిస్తామని డబ్బులు తీసుకోవటం...ఇలా ఒకటేమిటి. నియోజకవర్గాల్లోని జనాలను సంతానం పట్టి పీడిస్తున్న విషయం తెలిసినా దృతరాష్ట్ర ప్రేమతో కోడెల పట్టించుకోకపోవటమే చివరకు ఆయన  కొంప ముంచింది.

 

కొడుకు అరాచకానికి పరాకాష్ట ఏమిటంటే అసెంబ్లీ ఫర్నీచర్ ను తన వ్యాపార సంస్ధలో వాడుకోవటం. ఎప్పుడైతే టిడిపి అధికారంలో నుండి దిగిపోయిందో అప్పటి నుండే ముగ్గురికి దరిద్రం పట్టుకుంది. సంతానంతో పాటు కోడెల బాధితులంతా పోలీసు స్టేషన్లకు క్యూ కట్టారు. దాంతో పోలీసులు కూడా కేసులు కట్టారు. ఇలా సంతానం ఇద్దరి మీద చెరో 20 కేసులు నమోదయ్యాయి.

 

అదే సమయంలో కోడెల వల్ల టిడిపి ఇమేజి కూడా దెబ్బతిన్నదన్న కారణంతో చంద్రబాబునాయుడు కూడా కోడెలను దూరంగా పెట్టేయటంతో చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తనకు ఏ కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకపోవటంతో చేసేది లేక నరసరావుపేట ఫస్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. శివరామ్ లొంగిపోయారు సరే మరి కూతురు విజయలక్ష్మి సంగతేంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: