మీడియా మేనేజ్మెంట్....ఈ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబునే. ఏ విషయాన్ని అయిన ఆయన మీడియా ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్తారు. పార్టీ అధిష్టానం ఒక లైన్ ఇస్తే ఆ లైన్ లోనే పార్టీ నేతలు నడుస్తారు. పొల్లు పోకుండా మీడియా ముందు అవే మాటలు చెబుతారు. తప్పులు తమవైపు ఉన్న వాటిని ఒప్పులుగా మార్చుకుని మీడియా ముందుకొస్తారు. పార్టీ నేతలు ఏం మాట్లాడాలన్న టీడీపీ పార్టీ ప్రధాన కార్యలయం నుంచే స్క్రిప్ట్ వస్తుంది. దాన్నే నేతలు ఫాలో అవుతారు.


అయితే టీడీపీతో పోలిస్తే మీడియా మేనేజ్మెంట్ లో వైసీపీ వీక్ గా ఉందనే చెప్పాలి. మిగతా విషయాలని పక్కనబెడితే ఈ విషయంలో వైసీపీ టీడీపీని చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి నాలుగు నెలలు అవుతుంది. ఈ నాలుగు నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకిత వచ్చేసిందని టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ ప్రచారాన్ని వైసీపీ నేతలు ఆ స్థాయిలో విమర్శలని తిప్పికొట్టలేకపోతున్నారనే భావన రాజకీయ విశ్లేషుకుల్లో కలుగుతుంది.


సీఎం జగన్ కు ఎలాగో మీడియా ముందుకొచ్చి అలవాటు తక్కువ. చంద్రబాబు లాగా ఆయన ప్రతిదానికి మీడియా ముందుకొచ్చి డప్పుకొట్టరు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులదే. అయితే వీరు మీడియా ముందు మాట్లాడటంలో ఒక లైన్ ఫాలో అవ్వరు.  సమయానికి తగ్గట్టుగా వారికి నచ్చినట్లుగా మాట్లాడేస్తారు. కొందరు అయితే ఏం మాట్లాడతారో కూడా వారికే తెలియదు. దాని వల్ల పార్టీకి మరింత నష్టం వచ్చే అవకాశముంది.


పైగా అధికారంలో ఉండి కూడా టీడీపీ విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. పార్టీ తరుపున మీడియా సమావేశం పెట్టిన టీడీపీ నేతల్లాగా ఎక్కువసేపు ఉండరు. ఏదో తరుముకొస్తున్నట్లు ఐదు, పది నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించేస్తారు. పార్టీ ఆవిర్భవించి పదేళ్ళు దాటుతున్న ఈ విషయంలో మాత్రం వైసీపీకి ఓ విధానం లేకుండా పోయింది. పోనీ దీనిపై ప్రభుత్వ, పార్టీ సలహాదారులు ఏమన్నా సలహాలు ఇస్తారంటే అది లేదు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఇప్పటికైనా వైసీపీ అగ్రనేతలు మేల్కొని ఈ తప్పుని సరిదిద్దితే బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: