అరగంటలో అమెరికా చేరుకోగలదు.. బాంబుల వర్షం కురిపించగలదు... లక్ష్యాన్ని సర్వనాశనం చేయగలదు.. అగ్రరాజ్యానికే వెన్నులో వణుకు పుట్టే స్థాయి క్షిపణిని  చైనా ప్రదర్శించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి 70 యేళ్లు అయిన సందర్భంగా భారీ మిలిటరీ పరేడ్ నిర్వహించింది చైనా ప్రభుత్వం. మా బలం ఎంటో చూస్తారా అంటూ అమెరికాకు సవాల్ విసురుతూ తియనాన్మెన్ స్క్వేర్‌లో భారీ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది డ్రాగన్ కంట్రీ.  


ప్రపంచ శక్తిగా ఎదుగుతూ అమెరికాను ఢీ కొడుతున్న చైనా తన బలాన్ని, మిలిటరీ బలగాన్ని ప్రపంచానికి  చాటుతూ 70యేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.  చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా మారిన షీ జిన్ పింగ్ తియనాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. 56 తుపాకులను ఒక్కొక్కటి 70 రౌండ్ లు కాలుస్తూ వేడుకలను ప్రారంభించారు. చైనాలో ఉన్న 56 వర్గాలు ప్రజలను సూచిస్తూ 56 తుపాకులు.. 70 ఏళ్ల పాలనకు గుర్తుగా 70 రౌండ్ ల బులెట్లు గాలిలోకి పేలాయి. 


70 వ వార్షికోత్సవం సందర్భంగా చైనా ప్రదర్శించిన ఆయుధ సంపత్తి ప్రపంచాన్ని ముక్కుల వేలేసుకునేలా చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణిని డ్రాగన్ కంట్రీ ప్రదర్శించింది. శబ్ధ వేగం కంటే 25 రెట్లు వేగంగా ప్రయాణించగల క్షిపణి ఇప్పుడు చైనా అమ్ముల పొదిలో ఉంది. దీన్ని ఒక్కసారి ప్రయోగిస్తే అరగంటలో ఆమెరికాలోని లక్ష్యాన్ని చేరుకోగలదు. అమెరికా రక్షణ వ్యవస్థలను కూడా తప్పించుకో గల సామర్థ్యం దీని సొంతం. 


దక్షిణ చైనా సముద్రంలో ఘర్షణలు జరుగుతున్న సమయంలో చైనా ఈ క్షిపణిని తెరపైకి తీసుకువచ్చింది. ఒకరకంగా తమతో వాణిజ్య యుద్ధం చేస్తున్న అమెరికాకు హెచ్చరికలు పంపించింది చైనా. డాంగ్‌ఫెంగ్‌ -17 హైపర్‌ సానిక్‌ బాలిస్టిక్‌ క్షిపణిని కూడా చైనా ప్రదర్శించింది. ఇది హైపర్‌ సానిక్‌ వేగంతో కదులుతూ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పుదోవపట్టించగలదు. లక్ష్యాలను మార్చుకొనే సామర్థ్యం దీనికి ఉంది. అణ్వాయుధాలను కూడా ఇది మోసుకెళ్లగలదు. ఇవికాకుండా స్టెల్త్‌ డ్రోన్‌ డీఆర్‌-8, జే20 స్టెల్త్‌ జెట్‌, ది హెచ్‌-6ఎన్‌ బాంబర్లన కూడా చైనా ప్రదర్శించింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, హాంకాంగ్‌లో తీవ్రమైన నిరసనలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి సమస్యల సమయంలో చైనా తన సత్తాను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసింది. చైనా ప్రపంచ శక్తిగా ఎదిగిన తర్వాత నిర్వహించిన అతిపెద్ద ప్రభుత్వ వేడుక ఇదే. 


మరింత సమాచారం తెలుసుకోండి: