అబ్‌కీబార్ ట్రంప్ సర్కార్ అంటూ  హ్యూస్టన్‌లో మోడీ చేసిన ప్రసంగంపై ఇప్పుడు ఇండియాలో రాజకీయం మొదలయ్యింది. మోడీ రిపబ్లిక్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారంటూ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోడీకి కాస్తయినా.. దౌత్యనీతి నేర్పించండి అంటూ విదేశాంగమంత్రికి సలహా ఇచ్చారు. అబ్‌కీబార్ ట్రంప్ సర్కార్‌పై  జయశంకర్ ఇచ్చిన వివరణపై రాహుల్ సెటైర్లు వేశారు. అయితే కేంద్రం మాత్రం మోడీ మాటలను వక్రీకరించారని చెబుతోంది.  


మోడీ అన్న ఈ మాటలపైనే ఇప్పుడు వివాదం నడుస్తోంది. దేశ ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో పర్యటించిన మోడీ... దౌత్య విధానాలకు భిన్నంగా ఓ పార్టీకి, ఓ వ్యక్తికి అనుకూలంగా మాట్లాడారన్నది విపక్షాల ఆరోపణ. అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కేంద్ర విదేశాంగ మంత్రి వివరణ ఇచ్చారు. మోడీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదని... కేవలం గత ఎన్నికల్లో అప్పటి అభ్యర్ధి ట్రంప్‌ కూడా ఈ పదాలు వాడారని చెప్పారు. గతంలో జరిగిన దానిని గురించే ప్రధానమంత్రి  చెప్పారని...అంతకు మించి ఏమీ లేదని జయశంకర్ వివరణ ఇచ్చారు. 


అయితే విదేశాంగమంత్రి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ చేసిన తప్పును వెనకేసుకొస్తున్నందుకు థ్యాంక్యూ మిస్టర్ జయశంకర్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మోడీ రిపబ్లికన్ లకు అనుకూలంగా మాట్లాడం వల్ల భారత్‌కు మద్దతుగా ఉండే డెమొక్రట్ లు ఇబ్బందిపడుతున్నారని ట్వీట్ చేశారు. దౌత్యం అంటే ఏంటో మోడీకి కాస్త నేర్పించండి అంటూ జయశంకర్ వివరణపై రాహుల్ ట్వీట్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మోడీ కామెంట్స్‌లో ఎలాంటి వివాదం లేదంటోంది. ఆయన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనించమని చెబుతోంది. మరి మోడీ మాటలను ప్రతిపక్షాలు ఎంతవరకు తీసుకెళ్తాయో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: