ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమం గురించి నిన్న సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు మరియు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ల పోస్టుల ఖాళీలన్నింటినీ 15వ తేదీ నుండి భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే మాట వినిపించకూడదని సీఎం అధికారులకు చెప్పారు. అధికారులు సమీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించి ఖాళీగా ఉన్న వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. 
 
గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు చేసేవారు గ్రామ సచివాలయ రాత పరీక్షల్లో కొందరు ఎంపికయ్యారని అలాంటి చోట్ల ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సీఎం సూచించారు.2020 జనవరి 1వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రజలకు 500కు పైగా సేవలు అందించబోతున్నట్లు తెలిపారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు 2020 జనవరి 1వ తేదీ నుండి అర్హులకు ఇచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. 
 
సీఎం జగన్ వైయస్సార్ రైతు భరోసా పథకానికి ఎంపికైన లబ్ధిదారుల వివరాలు ఈ నెల 5వ తేదీన గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు.ఆక్టోబర్ 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వైయస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా మహిళలు మరియు పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. 2020 ఉగాది పండుగ రోజుకు ఇళ్ల స్థలాల పంపిణీ కొరకు 17 లక్షలకు పైగా లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. మిగిలిన ధరఖాస్తుల పరిశీలన త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 


 
 




మరింత సమాచారం తెలుసుకోండి: