తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో రాష్ట్ర ఉన్నత ధర్మాసనం ఝలక్ ఇచ్చింది. ఈ కూల్చివేత  నిర్ణయం ప్రభుత్వ విధానపరమైనదో కాదో, ఆ నిర్ణయం చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తేల్చాల్సివుందని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టుకు దసరా సెలవులు పూర్తయ్యే వరకు అంటే ఈ నెల 14 వరకూ ఎటువంటి పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. హై కోర్ట్ నిర్ణయంతో ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి అక్కడే నూతన సచివాలయాన్ని నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. సచివాలయ భవనాలు అనుకూలంగా లేవని, వాటిని కూల్చి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో కార్యాలయాలను బిఆర్‌కెఆర్‌ భవన్‌తోపాటు ఇతర కార్యాలయాల్లోకి తరలించారు. తరలింపు ప్రక్రియ కూడా పూర్తయింది. 



ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వరరావు, సామాజిక కార్యకర్త ఒఎం దేబ్ర, ఎంపి ఎ.రేవంత్‌రెడ్డి ఇతరులు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కూడా 2016లో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం  సచివాలయ భవనాల్ని కూల్చరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కోర్టులో కేసులు ఉండగా కూల్చివేత చర్యలు తీసుకుంటే అది న్యాయస్థానం విధానాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ కేసును ఇప్పటికిప్పుడే విచారణ చేయలేమని, 14న విచారిస్తామని, అప్పటి వరకూ కూల్చివేత చర్యలకు ప్రయత్నించవద్దని అడ్వకేట్‌ జనరల్‌కి న్యాయస్థానం మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సచివాలయం కూల్చివేతపై నిర్ణయం తీసుకుని కార్యరంగంలోకి దిగేందుకు సర్కారు సంసిద్ధమవుతుందని పిటేషన్లదార్లు ఆందోళన వ్యక్తం చేశారు.



 సచివాలయ భవనాల కూల్చివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున ఈ కేసుల్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్‌ లాయర్లు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. భోజన విరామం తర్వాత విచారిస్తామని బెంచ్‌ చెప్పింది. మున్సిపల్‌ కేసులపై వాదనలతో కోర్టు సమయం ముగిసింది. పిటిషనర్‌ తరపు న్యాయవాదులు కేసు తీవ్రతను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దసరా సెలవుల తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తామని సిజె తెలిపారు. అప్పటివరకు కూల్చివేత పనులు చేపట్టవద్దని ఎజికి స్పష్టంచేశారు. ఇప్పటికే సచివాలయ భవనాల్లోని ఆఫీసుల్ని ఇతర కార్యాలయాల్లోకి మార్చేశామని, కొత్త సచివాలయ భవనాల్ని కట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని అడ్వకేట్‌ జనరల్‌ బిఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. దీనిపై బెంచ్‌ కల్పించుకుని.. ఎక్కడ ఆఫీసులు ఉంటే అక్కడి నుంచే పాలన సాగించవచ్చునని, తిరిగి సచివాలయ భవనాల్లోకి రానవసరం లేదని వ్యాఖ్యానించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: