కొనుగోలు చేయ‌ని మందులు కొనేసిన‌ట్లు రికార్డుల్లో చూపించి వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టిన‌ ఈఎస్ఐ స్కాంలో ఒక్కొక్క‌రుగా నిందితులు వెలుగులోకి వ‌స్తున్నారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఈఎంఎస్) మందుల కొనుగోలు కుంభకోణంలో తెరవెనుక సూత్రధారి ఓమ్నీ మెడి సంస్థ ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జి అని స‌మాచారం. కొన్నేళ్లుగా ఐఎంఎస్ వ్యవస్థను పూర్తిగా చేతుల్లో పెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల విచారణలో బయటపడుతున్నట్లు స‌మాచారం. ఓమ్నీ మెడి సంస్థ ఎండీగా ఉన్న శ్రీహరిబాబు ఐఎంఎస్ అధికారులతో మిలాఖత్ అయి దందా నడిపినట్లు కీలక ఆధారాలు లభించడంతో అధికారులు ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.


కృష్ణాజిల్లాకు చెందిన శ్రీహరిబాబు, అప్పటి ప్రభుత్వాల్లోని కీలక నేతలతో ఉన్న పరిచయాలతో స్కాంకు తెరతీసినట్లు స‌మాచారం.  ఐఎంఎస్ ద్వారా ఈఎస్‌ఐకి మందులు సరఫరాచేసే సంస్థల్లో ఓమ్నీ మెడి 1998 నుంచి కొన‌సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ శ్రీహరిబాబు తన హవా కొనసాగించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ర్టాలకు మందులు సరఫరాచేస్తున్న సంస్థల్లో ఓమ్నీ మెడి కీలకంగా వ్యవహరిస్తోంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత చందాన బరితెగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తన దందాను కొనసాగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.


ప్రభుత్వం నుంచి బడ్జెట్ వచ్చేది మొదలు.. ప్రతి చర్య కూడా తనకు తెలిసేలా ఒక పెద్ద వ్యవస్థనే తయారుచేసుకొన్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఐఎంఎస్ వ్యవస్థను పూర్తిగా చేతుల్లో పెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఈ స్కాంలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి తెరముందు అంతా తానై నడిపితే.. తెర వెనుక వ్యవహారమంతా శ్రీహరిబాబు చూసుకొనేవాడని తెలుస్తోంది. డిస్పెన్సరీల నుంచి మందుల ఇండెంట్లు పెట్టించడం, తర్వాత బిల్లుల మంజూరు, మందుల సరఫరాలో గోల్‌మాల్‌చేయడం, వాటిని నల్లబజారుకు పంపడం వరకు అన్ని స్థాయిల్లోనూ శ్రీహరిబాబు హస్తం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించిన‌ స్వాధీనం చేసుకున్న పలు పత్రాలను విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారులు శ్రీహరిబాబు అక్రమాల చిట్టాను విప్పేపనిలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, . పక్కా ఆధారాలతో గత నెల 28న శ్రీహరిబాబును అరెస్టు చేయడం తెలిసిందే. శ్రీహరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొన‌సాగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: