ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ సొంత వాహనం కూడా లేదు. ప్రస్తుతం ఈ ముఖ్యమంత్రి దగ్గర కేవలం 15 వేల రూపాయల నగదు మాత్రమే ఉంది. ఆయన ఎవరో కాదు హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున ఖట్టర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హరియాణా రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. హరియాణా రాష్ట్రంలో ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తరపున మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగుతున్నాడు. ప్రస్తుతం ఖట్టర్ వయస్సు 65 సంవత్సరాలు. నిన్న ఖట్టర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఆస్తుల వివరాలను ఖట్టర్ వెల్లడించారు. ఖట్టర్ తన మొత్తం ఆస్తుల విలువ కోటీ 27 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. 
 
ఖట్టర్ 33 లక్షల రూపాయల ఆస్తులను స్థిరాస్థులుగా 94 లక్షల రూపాయల ఆస్తులను చరాస్థులుగా పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఖట్టర్ సమర్పించిన చరాస్థుల విలువ 8,29,952 రూపాయలు కాగా ప్రస్తుతం ఆ విలువ 94 లక్షల రూపాయలకు పెరిగింది. ఖట్టర్ తన సొంత గ్రామమైన రోహతక్ జిల్లాలోని బినాయిని గ్రామంలో 30 లక్షల రూపాయల వ్యవసాయ భూమితో పాటు 3 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు కూడా ఉందని చెప్పారు. 
 
ఈ ముఖ్యమంత్రి తనకు ఎటువంటి సొంత వాహనం లేదని అలాగే తనపై ఎటువంటి కేసులు కూడా లేవని అఫడవిట్ లో పేర్కొన్నారు. సొంత వాహనం కూడా లేని ఈ ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తుతం కేవలం 15,000 రూపాయల నగదు మాత్రమే చేతిలో ఉంది. ఖట్టర్ ఢిల్లీ వర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ముఖ్యమంత్రి ఎటువంటి బ్యాంకు రుణాలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటికి ఎటువంటి బకాయిలు కూడా లేవని తెలిపారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: