తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన విజ్ఞ‌ప్తికి సానుకూల స్పంద‌న రాలేదు. ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కార్మికుల‌ డిమాండ్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునిల్‌శర్మ సభ్యులుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించింది. ఈ సంద‌ర్భంగా, ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచ న విరమించుకుని సహకరించాలని కార్మికులకు రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తిచేసింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని సూచించింది. అయితే, ఈ చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. 


ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకునేలా,ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రిమండలి సుదీర్ఘంగా  చర్చించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించి వారి డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు మంత్రి మండ‌లి ఈ క‌మిటీని నియ‌మించింది. నివేదికను అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.


కాగా, ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో భేటీ అయింది. కార్మిక సమస్యలపై ఎలాంటి హామీ ఇవ్వకుండా.. సమ్మె చేయొద్దని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. తమ సమస్యలను సానుకూలంగా ఆలోచించాలని కోరిన నేతలు… తప్పని పరిస్థితిల్లోనే సమ్మెకు వెళ్తామన్నారు. తమపై నమ్మకముంచాలన్న అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించారు కార్మిక సంఘాల నేతలు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో...ఏమీ తేల్చకుండానే చర్చలు ముగిశాయి. కార్మికులు త‌మ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్న నేప‌థ్యంలో...ప్ర‌భుత్వం స్పంద‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: