అనంతపురం జిల్లా..ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో టీడీపీకి ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. ఒకవేళ పార్టీ అధికారం కోల్పోయిన పరువు దక్కించుకునేలా మాత్రం సీట్లు దక్కించుకుంది. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం జిల్లాలో గల 14 సీట్లలో కేవలం రెండు సీట్లని మాత్రమే గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్లలో ఓడిపోయింది. గెలిచిన అసెంబ్లీ స్థానాలు కూడా కంచుకోట హిందూపురం ఒకటి కాగా, మరొకటి ఉరవకొండ.


అయితే ఓటమి పాలైన దగ్గర నుంచి జిల్లా నేతలు అసలు కంటికి కనిపించడం లేదు. అధికారం కోల్పోయి నాలుగు నెలలు అయిన పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు అడ్రెస్ లేరు. పార్టీని గాలికొదిలేసి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బి‌కే పార్థసారథి, మరికొందరు నేతలు తప్ప జిల్లాలో ఎవరు యాక్టివ్ గా లేరు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ పార్టీ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అయితే ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఏం చేస్తారో అర్ధం కాదు. అటు జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి, కుమారుడు పవన్ కుమార్ రెడ్డిలు సొంత పనులు చేసుకోవడంలో  బిజీగా ఉన్నారు. ఇక హిందూపూర్ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు ఎక్కడో ఉన్నారో ఎవరికి తెలియదు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, కదిరి మాజీ ఎమ్మెల్యేలు కందికుంట వెంకట ప్రసాద్, చాంద్ బాషా, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీలు అడ్రెస్ లేరు.


హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉండగా, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఇలా ఎవరికి వారే పార్టీని పట్టించుకోకుండా ఉండటంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీకి మరింత నష్టం జరిగే అవకాశముంది. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు జిల్లా మీద దృష్టి పెట్టి నేతలని యాక్టివ్ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే కోలుకొనే అవకాశముంది. లేదంటే అంతే సంగతులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: