దేశవ్యాప్తంగా తెలుగు సాహిత్యానువాదం అన్నిభాషల్లోకి విస్తృతంగా అన్నిభాషల్లోకి కావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. తద్వారా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి రచయితలు, దేశభక్తుల, ప్రజానేతల గురించి దేశవ్యాప్తంగా తెలిసేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లోని సైబర్ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘థౌజండ్ హుడ్స్’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని వివిధ భాషల్లోని సారం మనకు అవసరమన్నారు. దాని వల్ల విద్యావికాసం జరుగుతుందని చెప్పారు. భిన్న భాషలకు నిలయమైన భారత్ లోనూ అద్భుతమైన సాహిత్య సంపద దాగుందని వీటిని డిజిటైజ్ చేయడంతోపాటు అనువాదాలను కూడా ప్రోత్సహించాలన్నారు. వీటితోపాటు తెలుగు సాహిత్యాన్ని, చరిత్రను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రతి యూనివర్సిటీలోనూ అనువాదం కోసం అనుబంధ విభాగాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా యూనివర్సిటీలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. జాతీయ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు కూడా ఈ దిశగా పనిచేయాలన్నారు.


తెలుగుదనానికి, భాషకు, భారతీయ విలువలు, సంప్రదాయానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన విశేష సాహిత్య సేవ మరువలేనిదని ఉపరాష్ట్రపతి నాయుడు అన్నారు. అహింస, సత్యం, విలువలతో దేశానికి మార్గదర్శనం చేసిన జాతిపిత జయంతి నాడు గాంధేయవాదాన్ని బలంగా విశ్వసించిన విశ్వనాథ వారి గురించి మాట్లాడుకోవడం ముదావహం అన్నారు. వలసపాలన వల్ల దేశంలో మానవ విలువలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘వేయిపడగలు’లో వివరించిన తీరు.. నేటి సమాజం ఎదుర్కొంటున్న విద్య, కుటుంబం, సమాజం, ఆర్థికం, సాంస్కృతికం ఇలా అన్నిరంగాల్లో దేశం ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలను ఈ నవలలో పేర్కొన్నారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కుటుంబ వ్యవస్థ ద్వారానే విలువలన్నీ నిలబడతాయన్న ఆయన సందేశం నేటికీ అనుసరణీయం అన్నారు. అందుకే ఆయన దేశం గర్వించదగ్గ అరుదైన రచయితల్లో ఒకరయ్యారన్నాని ప్రశంసించారు. స్వాతంత్య్రపోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో విశ్వనాథవారి రచనల పాత్రను విస్మరించలేమన్నారు. ఆయన తెలుగులో చెప్పిన, రాసిన చాలా అంశాలనే నేడు ప్రపంచం ఇంగ్లీషులో చెబుతోందని.. తెలుగులో చెబితే తక్కువగా, చిన్నగా కనిపించిన అంశాలే ఇప్పుడు ఇంగ్లీషులో చెబితే గొప్పవని చెప్పుకోవడం మనలో ఇంకా మిగిలున్న బానిసత్వ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని ఉపరాష్ట్రతి అన్నారు.



ఓ సందర్భంలో ‘ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని గులకరాళ్ల వెంట పరిగెత్తానే’ అని మహాకవి శ్రీశ్రీ విశ్వనాథ ఔన్నత్యాన్ని వివరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాశ్చాత్య సంస్కృతికీ, భారతీయ సంస్కృతికీ మధ్య వ్యత్యాసాల గురించి, వాటి మోజులో పడి వైభవోపేతమైన భారతీయతను మరిచిపోవద్దని, భక్తియోగం సులభమని.. జ్ఞానయోగం కఠినమైందని కూడా ‘వేయిపడగలు’ నవలలో ప్రస్తావించడం వెనకున్న నిగూడార్థాన్ని నేటి సమాజం అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య భారతంలో రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణలు గురించి.. స్వదేశీ వస్తువులు వినియోగం గురించి చక్కగా వివరించారన్నారు. విశ్వనాథ గారిదీ గాంధీ ఆర్థిక వాదమేనని.. అస్తిత్వవాదమే స్వదేశీవాదమని ఉపరాష్ట్రతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాస్త పొదుపును అలవర్చుకోవాలని.. అందనిదానికోసం పాకులాడి అప్పులపాలై.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోల్పోకూడదనేది విశ్వనాథ ఫిలాసీ అని ఆయన అన్నారు. గాంధీ కూడా ఉన్నంతలోనే సర్దుకోవాలి.. అప్పులపాలవ్వొద్దని సూచించారని గుర్తుచేశారు. 



పరీక్షలు, మార్కులకోసం చదివేది చదువైతే.. జ్ఞాన సముపార్జనకోసం చదివేది విద్య అని.. విద్య ద్వారా విమర్శనాత్మకత, విశ్లేషణాత్మకతను అలవర్చుకోవచ్చని ఆయన సూచించారు. గ్లోబలైజేషన్ వల్ల పల్లెటూరిలో వచ్చే మార్పుల గురించి.. భారత సంస్కృతిలో కశ్మీర్ ఎలా భాగమైందో ఆనాడే విశ్వనాథ వివరించారన్నారు. దేశానికి, ప్రపంచానికి జ్ఞాన దిక్సూచిగా ఉన్న వేయిపడగలు నవలను ఆంగ్లంలోకి అనువదించడం తెలుగువారు చేసుకున్న అదృష్టమన్నారు. ఇలాంటి మహనీయ వ్యక్తిత్వంపై, ఆయన రచనలపై పరిశోధనలు చేస్తున్న విశ్వనాథ పీఠాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. విద్యాభివృద్ధితోపాటు భాషా, సాహిత్యాభివృద్ధికోసం ఈ సంస్థ చేస్తున్న పనులను ఆయన ప్రశంసించారు. అనువాదం అంత సులభం కాదని.. అలాంటిది సాహిత్యాన్ని అనువాదం చేస్తున్నవారందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య విమర్శకురాలు డాక్టర్ మృణాలినికి విశ్వనాథ అవార్డు, రచయిత డాక్టర్ వైదేహి శశిధర్ కు వెల్చాల కేశవరావు స్మారక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ పీఠం చైర్మన్ డాక్టర్ వెల్చాల కొండల్ రావు, శాంతా బయోటెక్నిక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ మృణాళిని, డాక్టర్ వైదేహి శశిధర్ తోపాటు సాహితీవేత్తలు, రచయితలు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: