విశాఖ జిల్లాలో టీడీపీకి వరస షాకులు తగులుతున్నాయి. పార్టీలో సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక సామాజికవర్గం నేతలు, బీసీ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టీడీపీ పట్ల నమ్మకం సడలిందో లేక వారికి భవిష్యత్తు మీద బెంగ పుట్టిందో తెలియదు కానీ పార్టీ ఓటమి పాలు అయిన తరువాత  క్యూ కట్టి మరీ బయటకు పోతున్నారు.


విశాఖ జిల్లా గ్రంధాలయ  సంస్థ మాజీ అధ్యక్షుడు  తోట నగేష్ టీడీపీకి రాజీనామా చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన తోట పాయకరావుపేటలో టీడీపీకి గట్టి నాయకునిగా ఉన్నారు. ఆయన టీడీపీని వీడిపోవాలనుకోవడం పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు.


ఆయన గత  నెలరోజులుగా బీజేపీ, వైఎస్సార్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. చివరికి ఆయన బీజేపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఢిల్లీలో ఆయన బీజేపీ నాయకులతో మంతనాలు జరిపారని భోగట్టా వచ్చింది. దాంతో ఆయన రేపు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని అంటున్నారు.


తోట బీజేపీలో చేరితే ఆయనకు జిల్లాలోగానీ, రాష్ట్ర స్థాయిలో గానీ కీలకమైన పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకుడిగా పేరున్న తోట చేరడం ఓ విధంగా బీజేపీకి బలమేనని చెప్పుకోవాలి. చంద్రబాబు విశాఖ టూర్ నేపధ్యంలో  తోట సైకిల్ దిగిపోతున్నారు. ఇక మిగిలిన తమ్ముళ్ళు ఏ ముహూర్తం ఎంచుకుంటారో చూడాలి.


ఇదిలా ఉండగా ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం వైసీపీలో చేరిపోయింది. ఇక ఈ నెల 5న విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై కొట్టి వైసీపీలో చేరనున్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుదు సోదరుడు సన్యాసిపాత్రుడు టీడీపీని వీడిపోయారు. ఆయన కూడా వైసీపీ వైపు వస్తారని అంటున్నారు. రానున్న రోజుల్లో మరెందరు పార్టీని వీడుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: