ఇ.ఎస్.ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతమైంది. కటకటాల్లో ఉన్న నిందితులతోపాటు.. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న ప్రైవేట్‌ వ్యక్తుల చిట్టా విప్పుతున్నారు అధికారులు. విచారణలో బయటపడుతున్న అంశాలను చూసి ఏసీబీ బృందాలే నివ్వెరపోతున్నాయి. తాజా సోదాల్లో ఆసక్తికలిగే అంశాలను గుర్తించింది ఏసీబీ. 


ఇ.ఎస్.ఐ స్కామ్‌లో మరిన్ని అరెస్ట్‌లు దిశగా ఏసీబీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా కేటుగాళ్లను కటకటాల్లోని నెట్టాలని చూస్తున్నారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దేవికారాణి, పద్మలతోపాటు ఇతర నిందితులు ఇచ్చిన సమాధానం ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇ.ఎస్.ఐలో ఓమ్నీ మెడీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఓమ్నీ మెడీ ప్రతినిధి నాగరాజు ఇంట్లో సోదాలు చేయగా.. ఐ.ఎమ్.ఎస్ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉండాల్సిన కొన్ని కీలకమైన పత్రాలు లభించాయి. వీటి డూప్లికేట్‌ పత్రాలు మాత్రం దేవికారాణి ఆఫీసులో దొరికాయి. 


డిస్పెన్సరీల నుంచి వచ్చిన ఆర్డర్స్‌ను కాదని.. ఇష్టా రీతిన ఆర్డర్స్‌ పెట్టిన సీనియర్‌ అసిస్టెంట్‌ ఉపేందర్‌ పాత్రపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఉద్యోగులు పావనితోపాటు శివ, ప్రభులింగం ఇళ్లు, అనుమానిత ఉద్యోగుల నివాసాలు, ప్రైవేట్‌ వ్యక్తుల గృహాల్లో మరోసారి మెరుపు సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. పత్రాలను, వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. ఉద్యోగులు , ఫార్మా కంపెనీల మధ్య అనేక లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ...ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై లోతుగా దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తు మొత్తం ఓమ్నీ మెడీ చుట్టూనే తిరుగుతోంది. 


నాగరాజు ఇంట్లో జరిపిన సోదాల్లో... దాదాపు 46 కోట్ల విలువైన ఒరిజినల్‌ ఇండెంట్స్‌ , పర్చేజ్‌ ఆర్డర్‌ పత్రాలు దొరకడంతో..ఏసీబీ అధికారులు షాకయ్యారు. అంటే.. 46 కోట్ల నకిలీ బిల్లులు ఈ ఒరిజినల్‌ వాటి స్థానంలో వచ్చి చేరినట్టు తేలిపోయింది. వాస్తవానికి ఆ 46 కోట్ల బిల్లులు శాంక్షనైనా...వాటికి సంబంధించిన మందులు సరఫరా కాలేదని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ స్కామ్‌లో ప్రైవేట్‌ వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తోంది ఏసీబీ. కొందరిని ఇప్పటికే ప్రశ్నించారు అధికారులు.  దీంతో  ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్‌. దర్యాప్తు బృందాలు మాత్రం విచారణలో వెలుగు చూసిన అంశాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: