సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇబ్బందుల్లో పడ్డారు. కంపెనీ సిబ్బందితో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు లీక్ కావడంతో జుకర్ బర్గ్ ఇరుకున పడ్డారు. అమెరికన్ డెమక్రటిక్ అభ్యర్ధి ఎలిజబెత్ గురించి ఆయన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జుకర్ బర్గ్ వ్యాఖ్యలు తీవ్ర అలజడి రేకెత్తిస్తున్నాయి.

 



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమక్రటిక్ అభ్యర్ధి ఎలిజబెత్ ఎన్నిక కాకూడదని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈమేరకు ది వెర్జ్ పత్రిక ఈ అంశాన్ని ప్రచురించింది. ఆమె ఎన్నికైతే తమకు అనేక చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఫేస్ బుక్ ను విచ్ఛిన్నం చేయటానికి చర్యలు తీసుకునే అవకాశం ఉందని దీనిని ఎదుర్కోవటానికి సిద్ధం కావాలంటూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై మార్క్ మాట్లాడినట్టు తెలుస్తోంది. పెరుగుతున్న పోటీకి తగ్గట్టు వీడియో షేరింగ్ యాప్, టిక్ టాక్ తో పోటీపడాలని భావిస్తున్న తమ నిర్ణయాలకు గట్టి దెబ్బ పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఫేస్ బుక్, అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు ఎలిజబెత్ ఎన్నిక ఇబ్బందులు తెస్తుందని వ్యఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తమపై గురి పెట్టిందని వ్యాఖ్యానించారని అంటున్నారు.

 




ఎలిజబెత్ కూడా తన ట్విట్టర్ అకౌంట్లో దీనిపై ట్వీట్లు చేయడం ఇందుకు ఊతమిస్తోంది. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను సొంతం చేసుకుని ఫేస్ బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏలుతోందని ఆమె వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా విభాగంలో 80శాతానికి పైగా ఫేస్ బుక్ కు ఆదాయం వెళ్లిపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే మార్క్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: