అజిత్‌ దోవల్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భారత జాతీయ భద్రత సలహాదారుగా ఆయ‌న‌ది కీల‌క‌మైన పాత్ర‌.  జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసే చారిత్రాత్మక తీర్మానాలను రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించడానికి ముందు అత్యంత రహస్యంగా చాలా సుదీర్ఘ కసరత్తు జరిగింది. రాజ్యసభ సోమవారం ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ముందే జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. అప్పటికే శ్రీనగర్‌లో ఉన్న అజిత్ దోవల్ జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రక్రియను దాదాపు ఎనిమిది గంటల నుంచి పర్యవేక్షించారు. ఇంత‌టి కీల‌క‌మైన కార్య‌క‌లాపాలు నిర్వ‌హించిన‌ వ్యక్తి తాజాగా సౌదీలో ప‌ర్య‌టిస్తున్నారు.


సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ సమావేశమ‌య్యారు. జమ్ముకశ్మీర్‌ అంశంపై భారత్‌, సౌదీ అరేబియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి చర్చించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ను భారత్‌ రద్దు చేయడం, సౌదీ అరేబియాలోని చమురు నిల్వ కేంద్రాలపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడిపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం తదితర అంశాలూ చర్చకు వచ్చాయి. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయడంలో తమకు సహకరించాలని ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో అజిత్‌ దోవల్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 


మ‌రోవైపు, అబుదాబి యువరాజు మహమ్మద్‌ బిన్‌ జయాద్‌ నయ్యాన్‌తోనూ దోవల్‌ సమావేశమయ్యారు. ఇరుదేశాల యువరాజులతో దోవల్‌ చాలా అంశాలపై చర్చించారని అధికారులు చెప్పారు. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌ చర్యలను యువరాజు సల్మాన్‌ అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ చర్చలు ఇటు భారత్‌కు, అటు సౌదీ అరేబియా, అబుదాబి దేశాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయన్నారు. కాగా, జమ్ముకశ్మీర్ ఆపరేషన్‌కు అత్యంత పకడ్బందీగా కసరత్తు చేయ‌డ‌మే కాకుండా ఆ ప్ర‌క్రియ అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌టించి ప‌రిస్థితుల‌ను దోవ‌ల్ స‌మీక్షించారు. ఇబ్బందిక‌ర‌మైన చోట త‌న స‌ల‌హాలు,సూచ‌న‌ల‌తో వాటిని కొలిక్కి తెచ్చార‌నే పేరుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: