ప్రపంచం మొత్తం ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది...కానీ  కొన్ని చోట్ల మాత్రం మూఢనమ్మకాలను వీడడం  లేదు ప్రజలు . దేశం మొత్తం నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని  కొత్త పుంతలు తొక్కుతుంటే  కొందరు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలు పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చేతబడి బాణామతి అనే క్షుద్ర  పూజల పేరుతో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. క్షుద్ర  పూజలు చేస్తున్నారని నెపంతో  చిత్రహింసలకు గురి చేసే మానవత్వాన్ని మరిచి పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగగా  ప్రస్తుతం ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. 

 

 

 

 

 

 ఒడిశాలోని గంజాం జిల్లాలో క్షుద్ర  పూజల  నెపంతో  వృద్ధులపై దాడి చేయడంతో 29 మంది కటకటాల పాలయ్యారు. ఒడిషాలోని గంజాం జిల్లా గోపాపూర్ లో  రెండు వారాల వ్యవధిలో వివిధ కారణాలతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అంతేకాకుండా మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే క్షుద్ర పూజల వల్లే  గ్రామంలోని వారికి ఇలా జరిగిందని గ్రామస్తులు భావించారు. అయితే గ్రామంలో స్థానికంగా నివసించే ఆరుగురు వృద్ధులే  క్షుద్ర పూజలు చేసి ఇదంతా చేసి ఉంటారని భావించారు. దీంతో వృద్ధులని  కూడా చూడకుండా వాళ్లని చిత్రహింసలకు గురిచేశారు. 

 

 

 

 

 

 ఆరుగురు వృద్ధులను పట్టుకుని వాళ్ల పళ్ళు  పీకి వారితో అశుద్ధం తినిపించారు గ్రామస్తులు. ఆ తర్వాత చిత్రహింసలు చేసి గ్రామంలోని ఓ భవనం లో బంధించారు. అయితే ఈ సమాచారం అందుకున్న ఎస్పీ బ్రిజేష్ రాయ్  గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పొలిమేర్లలో పోలీసులను అడ్డుకునేందుకు కళ్లల్లో కారం చల్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. కాగా వాళ్లను చెదరగొట్టి గ్రామంలోకి తన బృందంతో వెళ్లిన ఎస్పి బాధితులను రక్షించి ఆస్పత్రికి తరలించారు.  తమపై కారంపొడి చల్లి తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 29 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయినా  29 మంది లో 22 మంది మహిళలే  ఉండడం గమనార్హం. కాగా ఈ ఘటనతో సంబంధమున్న ఇంకొంతమంది గ్రామం నుండి పరారవ్వగా... వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: