పినిపే విశ్వరూప్...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత. దివంగత నేత వైఎస్సార్ ప్రోత్సాహంతో 1989లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగ్రేటం చేశారు. 1998లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ముమ్మడివరం ఉపఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే జరిగిన1999 ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2004లో వైఎస్సార్ విశ్వరూప్ కు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ సారి వైఎస్సార్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశ్వరూప్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో అమలాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


అప్పుడు వైఎస్సార్ మంత్రివర్గంలో విశ్వరూప్ కు చోటు కూడా దక్కింది. ఇక నెక్స్ట్ వైఎస్సార్ మరణం, జగన్ పార్టీ పెట్టడంతో 2013లో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. ఇక మొన్న ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్  లో బెర్త్ దక్కించుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది. అయితే మంత్రిగా విశ్వరూప్ ఈ నాలుగు నెలల పనితీరుని ఒక్కసారి పరిశీలిస్తే... సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన మొదట రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు.


అలాగే అకస్మాత్తుగా వసతి గృహాలని పరిశీలించడం, వాటిల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవడం చేశారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించి విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. అటు ఎస్సీ,ఎస్టీ వారికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందేలా చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు తప్ప...తన శాఖలో పెద్ద మార్పులు వచ్చే నిర్ణయాలు ఈ నాలుగు నెలల్లో తీసుకోలేదని చెప్పాలి.


కాబట్టి కొన్ని రోజులు గడిస్తేనే మంత్రిగా విశ్వరూప్ సక్సెస్ అయ్యారో లేదో చెప్పగలం. ప్రస్తుతానికైతే విశ్వరూప్ మంత్రిగా ఎవరేజ్ మార్కులే తెచ్చుకున్నారు. అటు అధికార నేతగా ప్రతిపక్ష టీడీపీ విమర్శలని తిప్పిగొట్టడంలో కూడా విశ్వరూప్ వెనుకపడ్డారు.  గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్నా ఆయ‌న ఆ స్పీడ్‌ను అందుకుని అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో త‌న ముద్ర వేయలేక‌పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: