ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మత్తు పదార్థాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస సంఘనలు వెలుగులోకి వస్తుండటంతో ఖాకీలు కూడా అప్రమత్తం అయ్యారు. ఒక వైపున గంజాయి రవాణా చేస్తూ నిందితులు పట్టుబడుతుంటే, మరో వైపున విద్యార్థులే మత్తు పదార్థాలు తీసుకొని అరాచకాలు సృష్టిస్తున్నారు.  


గంజాయి, మత్తు పదార్థాలు... ఇంకో వైపున వ్యభిచారం..ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలతో రాజధాని ప్రాంతంలో కీలకమయిన మంగళగిరి నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది. ఒక వైపు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఉన్న మంగళగిరిలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో వెలుగులోకి వస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గత నెలలో కాజ టోల్ గేట్ వద్ద పోలీసుల పెద్ద ఎత్తున గంజాయి రవాణా అవుతుండగా పట్టుకున్నారు. చెన్నై నుండి మెదలుగొని కోల్ కతా వరకు ఈ గంజాయి రవాణా అవుతోంది. మధ్యలో స్టాక్ పాయింట్ల వద్ద దళారులు సరుకును తీసుకుంటున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళగిరి, రాజధాని ప్రాంతంలో కూడ విస్తృతంగా నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపద్యంలో మంగళగిరి ప్రాంతంలోని కార్పోరేట్ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకుని మధ్య చిన్న పాటి వివాదం జరిగింది. అది కాస్త తారా స్థాయికి వెళ్లి అధ్యాపకుడి కారు అద్దాలు ధ్వంసం చేసే స్థాయికి చేరింది.  నలుగురు విద్యార్థులు సృష్టించిన వీరంగం కళాశాలలో కలవరం రేపింది.  


అధ్యాపకులతో గొడవపడిన విద్యార్థులు మత్తు పదార్దాలు తీసుకున్నారన్న సమాచారం పోలీసులకు అందింది . దీంతో ఆశ్చర్యపోవటం అధ్యాపకులు, పోలీసుల వంతు అయ్యింది. కార్పోరేట్ ప్రైవేట్ కాలేజీలలో మత్తు పదార్థాలు వాడకం పై కలకలం మెదలైంది.. అధ్యాపకులపై దాడి , కారు అద్దాలు ద్వంసం ఘటనలో నలుగురు విద్యార్థుల ప్రమేయం ఉందని పోలీసులు నిర్థారించారు. ప్రాథమికంగా వారిని విచారించి, ఆధారాల కోసం ముందస్తుగా విద్యార్థుల రక్త నమూనాలు సేకరించారు. కాలేజీలోకి విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకువస్తుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్న. విద్యార్థుల్లో చాలామంది మైనర్లు ఉన్నారు.  మంగళగిరి లాంటి ప్రదేశాల్లో ఎవరు మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నారు. ముఠా కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: