అవివేకపు ఆలోచనలు మనిషిని పీడిస్తున్న చోట ఆధునిక జీవన విధానం వికసించదు,విస్తరించదు.అంతే కాకుండా శాస్త్రీయ అవగాహన,చైతన్యం బొత్తిగా లేని నేపథ్యం పలు ప్రమాదాలకు దారితీస్తుంది.ఇప్పటికే అక్కడక్కడ చేతబడి చేశాడన్న మూఢ నమ్మకంతో దారుణలెన్నో మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న అంధ విశ్వాసాల మందు పాతరల ఉనికిని చాటుతున్నాయి.ఒక మూర్ఖుడు తనను పీడిస్తున్న దుష్ట శక్తులు మటు మాయమవు తాయనే దుర్భ్రమతో తన మిత్రుడి మూడేళ్ల కవల పిల్లల్లో ఒకరిని తాను నివసిస్తున్న భవనం ఏడో అంతస్థు మీది నుంచి తోసేసి హతమార్చిన అమానుషంకొన్ని రోజుల క్రితమే ముంబై మహా నగరంలో జరిగిపోయింది.



ఇక చేతబడి నెపంతో అణగారిన వర్గాలకు చెందిన వారిని,వారిలోనూ ఎక్కువగా స్త్రీలను అనుమానించి హింసించడం,చంపడం దేశంలో పలు ప్రాంతాల్లోనూ,మన రాష్ట్రంలోనూ గతంలో తరచుగా జరిగేవి.ఇప్పుడు కూడ జరుగుతున్నాయి.ఇప్పుడు ఇలాంటి ఘటనే ఓడిశాలోని గంజమ్ జిల్లాలో జరిగింది.ఇక్కడ ఐదుగురు పురుషులపై క్షుద్రపూజలు చేస్తున్నారంటూ నిందమోపిన కొందరు మహిళలు..వారి పళ్లను పీకి,అనంతరం వారి చేత మానవ మలాన్ని బలవంతంగా తినిపించారట.ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం సోమవారం ఓడిశాలోని గంజమ్ జిల్లాలో జరిగింది.



గోపాపూర్ గ్రామంలో ఇటీవలే ముగ్గురు మహిళలు అనారోగ్యంతో మృతి చెందారు.మరి కొందరు ప్రస్తుతం రోగాలతో బాధపడుతున్నారు.ఈ మరణాలకు అదే గ్రామంలో నివసిస్తున్న ఐదుగురు పురుషులు కారణమని,యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న వీరందరూ  క్షుద్రపూజలు చేస్తున్నారంటూ గ్రామంలోని కొందరు మహిళలు అనుమానంతో,వారిని ఇళ్లలోంచి బయటకు ఈడ్చుకొచ్చి  దాడికి పాల్పడ్డారు.



అంతే కాకుండా వారి పళ్లు పీకి..ఆపై బలవంతంగా వారి చేత మానవ మల్లాన్ని తినిపించారు. కాగా..ఈ దారుణం గురించి పోలీసులకు సమాచారం అందటంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని,బాధితులను ఆసుపత్రికి తరలించి,ఇందుకు కారణమైన 22 మంది మహిళలను అరెస్టు చేశారు.ఆధునిక విజ్ఞానం,శాస్త్రీయ చైతన్యం చొరబడని ప్రాంతాల్లో అంధకారం అమానుషాలే నిర్ణేతలవుతాయి.అప్పడా సమాజమే విలన్‌గా మారుతుంది. అభం శుభం తెలియనివారి ప్రాణాలను ఇలా బలిగొంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: