తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర గోదావరినదిలో మునిగిన బోటును తీయడం కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం బోటు వెలికితీతకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి. బోటును వెలికితీయటానికి ధర్మాడి సత్యం బృందం ముమ్మరంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం గోదావరి ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురవడంతో బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. 
 
ప్రస్తుతం గోదావరి నదిలో వరద ఉధృతి కూడా పెరిగిందని తెలుస్తోంది. బోటు మునిగిపోయిన ప్రాంతంలో సుడులు తిరుగుతున్నాయని ధర్మాడి సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు. బోటు ప్రమాదంలో మృతదేహాలు లభ్యం కాని కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోలేదని బాధ పడుతున్నారు. ఇప్పటికే బోటు ప్రమాదం జరిగి 20 రోజులైంది. ధర్మాడి సత్యం బృందం వరద ప్రవాహం వలన మరో ప్రమాదం జరగకూడదని బోటు వెలికితీత పనులు ఆపేశామని చెబుతున్నారు. 
 
ప్రభుత్వం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీత పనులను అప్పగించింది. ధర్మాడి సత్యం బృందం లంగర్లను ఉపయోగించి బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేసినా పరిస్థితులు అనుకూలించటం లేదు. బోటు ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలు ఇన్నిరోజులైనా లభ్యం కాకపోవటంతో ప్రభుత్వంపై గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
రాయల్ వశిష్ట బోటు 300 అడుగుల లోతులో ఉందని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. దాదాపు 40 టన్నుల బరువు ఉన్న రాయల్ వశిష్ట బోటు బురదలో కూరుకుపోయిందని, బురదలో కూరుకుపోయిన బోటును కదిలించటం చాలా కష్టమైన పని అని తెలుస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. 18 మృతదేహాలు ఇంకా లభ్యం కావాల్సి ఉందని సమాచారం అందుతుంది. ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలం కావటంతో బోటు తీయటం సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: