మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, సమాజానికి ఉపయోగపడేలా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్. విద్యార్ధులు మంచి ఆరోగ్యంతో తరగతులకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీలకు సూచించారు. విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ఆదేశించారు. మోడీ ఆశయాలకు అనుగుణంగా రైతుల ఆదాయం డబుల్  చేసేందుకు  యూనివర్సిటీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  


గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక యూనివర్సిటీల ఛాన్సలర్ గా వీసీల కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.  యూనివర్సిటీలలో పరిస్థితులపై సమీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రతీ యూనివర్సిటీ అభివృద్ధి, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆమె దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళల ఎన్ రోల్ మెంట్ పెరగాలని, విద్యార్థులు తరగతులకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఏడాది స్నాతకోత్సవాలు నిర్వహించాలని సూచించారు. 


యోగా, ఫిజికల్ ఆక్టివిటీ పెంచాలనీ.... విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని,  వారి హెల్త్ రికార్డ్ లను తయారు చేయాలని ఆదేశించారు గవర్నర్. ఉన్న వనరులతోనే యూనివర్సిటీలలో మౌలిక వసతులు పెంచాలని చెప్పిన ఆమె.. సామాజిక న్యాయం పాటించాలని.. యూనివర్సిటీ లు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు.  విద్య కోసం మోడీ ప్రభుత్వ కార్యక్రమాలను ఈ సమావేశం లో వివరించిన గవర్నర్ తమిళి సై... వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు మిగతా యూనివర్సిటీలు గ్రామీణ సాధికారత, మోడీ డ్రీమ్ ప్రాజెక్టు రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గ పరిశోధనలు చేయాలని కోరారు.  


యూనివర్శిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని గవర్నర్ తమిళిసై వీసీలకు హామీ ఇచ్చారు.   గవర్నర్ తమిళిసై అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారనీ, ఆమెకు యూనివర్సిటీల పై మంచి అవగాహన ఉందని అన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్  పాపిరెడ్డి  అభిప్రాయపడ్డారు.  అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ వీసీ ల కాన్ఫరెన్స్ కి ఉన్నత విద్యా మండలి అధికారులు, యూనివర్సిటీ ల ఇంఛార్జ్ వీసీ లు హాజరయ్యారు. గవర్నర్ సూచించిన అంశాలు ఏ మేరకు ఆ యూనివర్సిటీ లు అమలు చేస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: