ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో తెలంగాణ, ఏపీ పారిశ్రామిక విధానాలను, అభివృద్ధిని వివరిస్తున్నారు ఇరు రాష్ట్రాల ఐటీ మంత్రులు. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయంతో కలిసి ఒక ఎకనామిక్ విజన్ కోసం పనిచేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు.   


ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్ సదస్సులో ఏపీ, తెలంగాణ ఐటీ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక ప్రగతి సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనేక పాలసీలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారం ఉన్నప్పటికీ అసలైన యాక్షన్ క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు.  కేంద్ర, రాష్ట్ర జాబితాలతో పాటు ఉమ్మడి జాబితా అంటూ రాజ్యాంగం ప్రత్యేకంగా అధికారాలను నిర్ణయించిందని.. అయితే మారిన పరిస్ధితుల నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అప్పగించాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు కేటీఆర్.  


దేశంలో పరిశ్రమల అనుమతులు, వాటిలో ప్రభుత్వాల పాత్ర విషయంలో టీఎస్ ఐపాస్  చట్టం ద్వారా ఒక విస్తృతమైన చర్చకు తెర లేచిందన్నారు కేటీఆర్. ఇప్పటికే 11వేలకు పైగా అనుమతులు ఇచ్చామని, ఇందులో 8 వేల 400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని తెలిపారు. ఈ చట్టం వచ్చిన తర్వాత సుమారు 12 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని, దీంతోపాటు రెండుసార్లు తెలంగాణ రాష్ట్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజిసెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు కేటీఆర్. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంతో  దుకెళ్తున్నామని  చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీలో జపాన్ సహా ఇండియన్  కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపిస్తున్నాయని  వివరించారు. తమ తమ రాష్ట్రాల్లో పారిశ్రామిక  విధానాలను వివరిస్తూ..పెట్టుబడి అవకాశాలను వివరిస్తున్నారు మంత్రులు కేటీఆర్, గౌతమ్ రెడ్డి.   

మరింత సమాచారం తెలుసుకోండి: