హుజూర్ నగర్ లో ఇప్పుడు ఎక్కడచూసినా గులాబీ జెండాల రెపరెపలే కనిపిస్తున్నాయి. అన్ని వర్గాల జనాన్ని ఆక‌ట్టుకునేందుకు...ఓట్లు సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు చెమ‌టోడుస్తున్నాయి. హుజూర్‌నగర్‌ దశ తిరగాలంటే కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మండలాల వారీగా నియమితులైన పార్టీ ఇన్‌చార్జ్‌ లు సమన్వయ కర్తలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికలో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని  ధీమా వ్యక్తం చేస్తున్నారు.


హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో మండ‌లాల్లో టీఆర్ఎస్ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. త‌మ‌ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎంపీ మాలోత్ కవిత,  టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి.. ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, మండలి విప్‌ కర్నె ప్రభాకర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, స్థానిక నాయకులు ర్యాలీలు నిర్వ‌హించారు.


హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎలాంటి పక్షపాతం లేకుండా నియోజకవర్గానికి నిధులు విడుదల చేశారని  ఉపఎన్నికల టీఆర్‌ఎస్ ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.  24 గంటల కరంటు, ఆసరా పింఛన్లు, గొర్రెలు, చేపల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలన్నింటినీ కల్పించారు. కానీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అహంకారంతో నియోజకవర్గం అభివృద్ధికి దూరమయింది అని హుజూర్‌నగర్అన్నారు. నాగార్జునసాగర్ జలాశయం డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ ఎడమకాల్వ కింద రెండు పంటలకు నీళ్లిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. 
హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు ఇస్తే పనులు కాకుండా ఉత్తమ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూర్‌నగర్ రూపురేఖలే మారుస్తామని.. ఈ ఎన్నికలు నియోజకవర్గ అభివృద్ధే అంశంగా జరుగుతున్నాయన్నారు. మహిళపై ఇందరు మంత్రులు, ఎమ్మెల్సీలను సీఎం పంపుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉన్నదని.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఉత్తమ్ ఓడించినప్పుడు ఆమె ఓ మహిళ అనే విషయం పద్మావతికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: