మద్యపాననిషేధం ముసుగులో ప్రజల ధనాన్ని పీల్చి, వారి ఆరోగ్యాలను పిప్పిచేసేలా నూతనపాలసీ తీసుకొచ్చిన ఘనత వైసీపీప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతులసునీత ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వస్తే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, గద్దెనెక్కాక దశలవారీగా చేస్తామని చెప్పడం ప్రభుత్వ బూటకపు చర్యల్లో ఒకటని ఆమె స్పష్టంచేశారు. 3,600 మద్యం దుకాణాలు తెరిపించి,  కానిస్టేబుళ్లతో మద్యం అమ్మించడమేనా ప్రభుత్వం చేపట్టిన మద్యపాన నిషేధమని ఆమె  ప్రశ్నించారు. 

నిషేధం మాటున భారీకుంభకోణానికి తెరతీసిన జగన్‌ ప్రభుత్వం, రాష్ట్రంలో మొత్తం 4,880  దుకాణాలుంటే, వాటిలో రెన్యువల్‌ కానివి 777 ఉన్నాయని చెప్పారు . అవిపోగా మిగిలిన 3,600కు పైగా దుకాణాల నిర్వహణను ప్రభుత్వం చేపట్టిందన్నారు.  వాస్తవానికి 20 శాతం దుకాణాలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం, నిజంగా అదేపని చేసుంటే, 2,883 దుకాణాలు మాత్రమే కొనసాగాల్సి ఉండగా, 3,600కు పైగా షాపులు నిర్వహించడమేనా ప్రభుత్వం చెప్పిన మద్యపాన నిషేధమని సునీత నిలదీశారు. నూతన పాలసీపేరుతో సామాన్యులు ఎక్కువగా వినియోగించే బ్రాండ్లపై ఒక్కో బాటిల్‌కు రూ. 80 వరకు ధరలు పెంచిన ప్రభుత్వం, నయాదోపిడీకి తెరతీసిందన్నారు. పేదలు, సామాన్యులు తాగే ధరలను పెంచి, ధనవంతులు, బడాబాబులు తాగే బ్రాండ్లపై అరకొరగా ధరలుపెంచి, ఎవరి జీవితాలను నాశనంచేయాలని చూస్తుందో స్పష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు.


 అధికారంలోకి రాకముందు మద్యపాననిషేధమంటూ ప్రగల్భాలు పలికినవారే, అధికారం చేపట్టాక ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ ఖజానా నింపుకోవాలని చూడటం దురదృష్ట కరమని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తంచేశారు. నూతన మద్యంపాలసీ అస్తవ్యస్తంగా ఉండటంతోపాటు, ప్రభుత్వం ధరలు పెంచడం వల్ల, ప్రజలు  గుడుంబా, సారాయి, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటుపడే అవకాశాలు  అధికంగా ఉన్నాయని సునీత తెలిపారు. తక్కువధరకు లభిస్తున్నాయనే ఆశతో పేదలు, సామాన్యులు వాటిపై ఆశపడతారని, తద్వారా వారిఆరోగ్యం నాశనమవుతుందని ఆమె తేల్చిచెప్పారు. ఈ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఖజానా నింపుకోవాలని  చూడటం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. 


మద్యంషాపుల వద్ద పర్మిట్‌రూములు ఎత్తేయడ ం వల్ల మందుబాబులు రోడ్లపై కూర్చొని తాగుతూ, వీరంగం వేస్తున్నారని, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆమె తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, మసీదుల మధ్యలో దుకాణాలుపెట్టిన ప్రభుత్వం, ఎంతమందిని ఇబ్బందులుకు గురిచేస్తుం దో ఆలోచించాలన్నారు. ఇళ్లమధ్యన షాపులు పెట్టవద్దని మహిళలు అడుగుతున్నా లెక్కచేయకుండా, తిరిగి వారినే దుర్భాషలాడటం వంటివి నిత్యకృత్యాలుగా మారాయన్నారు  చదువుకున్న యువతతో మద్యం అమ్మిస్తూ, మూటలు మోయిస్తూ, ఉద్యోగాలిచ్చామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యంపాలసీ మహిళలను, విద్యార్థులను, యువతను, సామాన్యమద్యపాన ప్రియులను, తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా ఉందని, దోపిడీకి అలవాటుపడిన వైసీపీ సర్కారు దీనిపై పునరాలోచన చేయాలని ఆమె డిమాండ్‌చేశారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: