అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు సైతం కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న వామ‌పక్షాల వైఖ‌రిపై ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ ప్రకటించింది. మఖ్దూం భవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతున్నది. 


హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయకూడదని నిశ్చయించుకొన్న క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్.. ఆ పార్టీ మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఇరుపార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కార్యవర్గ సమావేశంలో సీపీఐ నేతలు చర్చించారు. అనంతరం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. సమావేశంలోని వివరాలను మీడియాకు వివరిస్త్తూ.. అసెంబ్లీ ఎన్నికల వరకే కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కొనసాగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేశామని గుర్తుచేశారు.


సీపీఐ వైఖ‌రి స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో....సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై న్యాయపరమైన అవకాశాలను చర్చిస్తున్నామని, ముందుగా ఈ విషయంపై ఈసీని కలిసిన అనంతరం కోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు. న్యాయపరంగా పోటీలో నిలిచే అవకాశం లేకపోతే.. 6వ తేదీన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తామని కీలకనేత ఒకరు వెల్లడించారు. సెంట్రల్‌కమిటీ ఆదేశాలకనుగుణంగా నిర్ణయం వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇప్ప‌టికీ...రెండు పార్టీలు కూడా సీపీఎం మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: