ఉద్యోగం పురుష ల‌క్ష‌ణం అనే నానుడి ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే, పురుషులే కాకుండా మ‌హిళ‌లు సైతం ఉద్యోగాలు చేస్తున్నారు. తాము ఎందులోనూ తీసిపోబోమ‌ని చాటిచెప్తున్నారు. అయితే, ఇప్ప‌టికీ మ‌హిళ‌ల ప్రాతినిధ్యం త‌క్కువ‌గా ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.  కార్పొరేట్‌ రెస్పాన్సిబులిటీ వాచ్‌ (సీఆర్‌డబ్ల్యు) నివేదిక ప్ర‌కారం, దేశంలోని ప్రధాన కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య దారుణంగా ఉన్నట్టుగా స్ప‌ష్ట‌మైంది. మ‌న‌దేశం లోని ప్రధాన కంపెనీల్లోని 53 సంస్థల్లో పురుష- స్త్రీ ఉద్యోగుల నిష్పత్తి 10:1 శాతం లేదా అంతకంటే తక్కువగానే ఉన్నట్టుగా వెల్లడైంది.


దేశంలోని 300 ప్రధాన కంపెనీలలో కేవలం 39 సంస్థలు మాత్రమే తమతమ కంపెనీల్లో పని చేస్తున్న వారి వివరాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చినట్టుగా ఈ నివేదిక వివరించింది. మొత్తం కంపెనీలలో కేవలం 103 కంపెనీలు మాత్రమే మహిళా ఉద్యోగుల తగ్గింపునకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించగా.. మిగతా కంపెనీలు ఇందుకు నిరాసక్తతను కనబరిచాయి. వీటిని క్రోడీక‌రించిన‌ కార్పొరేట్‌ రెస్పాన్సిబులిటీ వాచ్‌ (సీఆర్‌డబ్ల్యు) నివేదిక ప్రధాన కంపెనీల్లో దాదాపు 70 శాతం కంపెనీల్లో దివ్యాంగులైన ఉద్యోగుల సంఖ్య ఒక శాతం కంటే కూడా తక్కువగా ఉన్నట్టుగా ఈ నివేదిక ప్ర‌క‌టించింది.


మ‌రోవైపు  కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమం నిధుల విష‌యంలో ఆస‌క్తిక‌ర స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. దేశంలో వివిధ కంపెనీలు  కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమం నిధుల్లో  అత్యధికం అంటే దాదాపు రూ.2,482.75 కోట్లు మహారాష్ట్రకు అందినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ వెల్లడించిన నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను 16,785 కంపెనీలు కేవలం రూ.10,065 కోట్ల మేర నిధులను మాత్రమే సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలకు కేటాయించినట్టుగా తెలిపారు. దేశంలోని కంపెనీలు దాదాపు రూ.23,247.90 కోట్ల మేర నిధులను సీఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేయాల్సి ఉండగా సంస్థలు ఇందులో కేవలం 57 శాతం నిధులను మాత్రమే వెచ్చించినట్టుగా నివేదిక తెలిపింది.ఈశాన్య రాష్ట్రాలకు కేవలం రూ.29.9 కోట్లు మాత్రమే సీఎస్‌ఆర్‌ గ్రాంట్ల కింద నిధులు అందినట్టుగా ఈ నివేదిక పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: