ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని నిన్న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో, క్యాబ్ నడుపుతున్న 1,73,531 మందికి లబ్ధి చేకూరింది. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే హామీని అమలు చేశారు. 10,000 రూపాయల చొప్పున ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలలో నిన్న డబ్బులు జమ అయ్యాయి. 
 
ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలలో జమ చేస్తానని సీఎం జగన్ చెప్పారు. గాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం అమ్మకపోయినా మద్యం అమ్మిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయటంతో జగన్ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. గాంధీ జయంతి రోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రతి పేదవాడికి మంచి జరగాలని గ్రామ సచివాలయాలను ఆవిష్కరించామని అన్నారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 43 వేల బెల్టు షాపులుండేవి. మినరల్ వాటర్ లేకపోయినా ప్రతి ఊరిలో మద్యం షాపు దర్శనమిచ్చేది. కానీ మేం అధికారంలోకి రాగానే కొత్త మద్యం పాలసీని తెచ్చామని జగన్ అన్నారు. 43 వేల బెల్టు షాపులను ఎక్కడా కనిపించకుండా చేశామని చెప్పారు. ప్రతి అడుగులో మంచి చేయడం కొరకు తాపత్రయపడుతుంటే చంద్రబాబు గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు తెరిచిపెట్టామని ప్రభుత్వంపై అబాండాలు వేస్తారని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెబుతారు. మరి గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు తెరిచామని పట్ట పగలే అబద్ధాలు ఆడటం సబబేనా ? అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు చూసినపుడు మనసుకు బాధ కలుగుతుందని మీ ముఖాల్లో చిరునవ్వు చూసినపుడు సంతృప్తి కలుగుతుందని జగన్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్ప పరిపాలనను దేవుడు నాతో చేయించాలని కోరుకుంటున్నానని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: