తెలుగుదేశం, వైసీపీ మధ్య ఇప్పడు సోషల్ మీడియా అంశంపై వైరం సాగుతోంది. మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. ఇటీవల టీడీపీ కార్యకర్తలను సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్‌మీడియాలో చంద్రబాబు, లోకేష్‌ విషప్రచారం చేయించారని ఆధారాలతో నిరూపిస్తానని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సవాల్ చేస్తున్నారు.


తాను నిరూపిస్తే.. పెద్దబాబు, చిన్నబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు బహిరంగ చర్చకు పిలిచారని, బాబు నిర్ణయించిన ప్రదేశంలో, అనుకూలమైన చానళ్ల సమక్షంలో చర్చకు వచ్చేందుకు సిద్ధమన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే....

" హైదరాబాద్‌లోని నందమూరి బాలకృష్ణకు సంబంధించిన బిల్డింగ్‌లో సుమారు 2 వేల మందిని నియమించుకొని సోషల్‌ మీడియాలో పదే పదే సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిలమ్మ, చివరకు వైయస్‌ భారతమ్మను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టించిది చంద్రబాబేనని వాస్తవాలతో సహా నిరూపిస్తా..


వైయస్‌ఆర్‌ సీపీ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఏ విధంగా వేధించి, వేంటాడి కించపరిచేలా ఎలా అవమానాల పాలు చేశాడో.. సాక్షాధారాలతో వస్తాం.. చంద్రబాబు కూడా ఆధారాలతో సహా రావాలి.. బాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. విమర్శలను దీటుగా ఎదుర్కొని సాక్షాధారాలతో చట్టపరమైన చర్యలకు వెళ్లి ఉంటే బాగుండేది. వైయస్‌ షర్మిలమ్మపై సోషల్‌ మీడియాలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నైతికత ఏమైంది..


పథకం ప్రకారం.. 2 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారితో సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయించడం, వైయస్‌ జగన్‌ కుటుంబం గురించి మాట్లాడడం, వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్న కుట్ర అని ఆధారాలతో సహా నిరూపిస్తా.. చంద్రబాబు విచారణకు సిద్ధం కావాలని, నాలుగు రోజుల గడువు ఇస్తా. నువ్వు చెప్పిన ప్రదేశానికి వస్తా. స్థాయి తగదనుకుంటే ఓడిపోయిన నీ కుమారుడిని పంపించు చంద్రబాబూ... అని సుధాకర్ బాబు మరోసారి సవాలు విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: