హుజూర్ నగర్ ఉప ఎన్నిక తలమీద ఉన్న తరుణంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు  సమ్మె బాట పట్టడాన్ని అధికార టిఆర్ఎస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది.  సమ్మె ప్రభావం హుజూర్ నగర్  ఉప ఎన్నికపై ఎంతో, కొంత ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది .  అందుకే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ఏదోరకంగా విరమింప చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్,  మంత్రులు చివరి వరకు  చేసిన ప్రయత్నాలు  విఫలమయ్యాయి . ఆర్టీసీ కార్మికులకు డిమాండ్ల ను  తీర్చడానికి సిద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వం వారిని బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నాన్ని చేస్తోంది.


 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు విధులకు హాజరు కాని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.  ఆర్టీసీ కార్మికులు  కచ్చితంగా శనివారం  ఆరు గంటల లోపు విధులకు హాజరు కావాలని లేనిపక్షంలో వారంతట వారే తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆయన చెప్పుకొచ్చారు.  ప్రభుత్వ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు లొంగే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు తేల్చి చెబుతున్నారు.  ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి టి - పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 


కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె తమకు రాజకీయంగా ఎంతో కొంత కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా భావిస్తోంది.  ప్రభుత్వం ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.  ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న ఆర్టీసీ కార్మికులు కూడా పరోక్షంగా కాంగ్రెస్ కు  మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: